గోరంట్ల మాధవ్ వీడియోకి కోటి ఆఫర్
గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం మూడు నెలలుగా నడుస్తోందని ఒక ఆంగ్ల దిన పత్రిక చెబుతోంది. కొందరు వ్యక్తులు ఈ వీడియోను అమ్మకానికి పెట్టారని చెబుతున్నారు.
గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఎలా బయటకు వచ్చిందన్న దానిపై రకరకాల కథనాలు వస్తున్నాయి. సదరు మహిళ ద్వారానే ఈ వీడియో బయటకు వచ్చినట్టు భావిస్తున్నారు. అయితే ఆమెను ఏమైనా అంటే తిరిగి ఆమె కేసు పెడితే .. ఎంపీ మరింత ఇరుక్కుంటారన్న భావనతో మౌనంగా ఉంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ వీడియో నకిలీనా, నిజమైనదేనా అని తేల్చే విషయంలోనూ ప్రభుత్వ యంత్రాంగం స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తున్నట్టు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఒక ఆంగ్ల దిన పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం మూడు నెలలుగా నడుస్తోందని ఆ పత్రిక చెబుతోంది. కొందరు వ్యక్తులు ఈ వీడియోను అమ్మకానికి పెట్టారని చెబుతున్నారు. దాదాపు కోటి రూపాయలకు బేరం పెట్టినట్టు కథనం. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోను దక్కించుకునేందుకు ప్రతిపక్ష పార్టీ నాయకులతో పాటు వైసీపీలోని కొందరు వ్యక్తులు కూడా తమ పరిధి వరకు బేరమాడినట్టు కథనం.
అయితే ఈ వీడియోను ఎవరు సొంతం చేసుకుని దాన్ని మీడియాలో ప్రదర్శనకు పెట్టారన్న దానిపై క్లారిటీ లేదు. టీడీపీ మీడియానే ప్రముఖంగా ఈ వీడియోపై రచ్చ చేయడంతో టీడీపీ ఏమైనా ఆ వీడియోను కొనుగోలు చేసిందా అన్న అనుమానాలను వైసీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అటు మాధవ్ రాజీనామా కోసం తెలుగుదేశం పార్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. పరిస్థితి చల్లబడే వరకు జిల్లాకు రావొద్దని గోరంట్ల మాధవ్‌కు పోలీసు ఉన్నతాధికారులు సూచించినట్టు తెలుస్తోంది.