లంచం కేసులో పాతికేళ్ల తర్వాత శిక్ష.. - 80 ఏళ్ల వృద్ధుడినని వేడుకున్నా.. కుదరదన్న ధర్మాసనం
ఈ కేసుపై అప్పట్లో విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ కోర్టు లంచం తీసుకున్నారనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవంటూ 2005లో కేసును కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏసీబీ అధికారులు 2007లో హైకోర్టును ఆశ్రయించారు.
ఆయన వయసు 80 ఏళ్లు.. పాతికేళ్ల క్రితం పెట్టిన అవినీతి కేసులో విచారణ ఇప్పటికి పూర్తయింది. ఆయనపై నేరం రుజువు కావడంతో హైకోర్టు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. తన వయసు ఇప్పుడు 80 ఏళ్లని.. అనారోగ్యంతో బాధపడుతున్నానని, తనను కనికరించాలని న్యాయస్థానాన్ని వేడుకున్నా కుదరదని తేల్చి చెప్పింది ధర్మాసనం. అయితే గరిష్ట శిక్షతో కాకుండా కనిష్ట శిక్షతో సరిపెట్టింది. దీంతో ఆయన చేసిన తప్పు వెంటాడుతూ.. చివరికి 80 ఏళ్ల వయసులో శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆయన పేరు బత్తిన వెంకటేశ్వరరావు. కృష్ణాజిల్లా తిరువూరు ఎంపీడీవోగా పనిచేసిన కాలంలో యూవీ శేషారావు అనే ప్రధానోపాధ్యాయుడి బదిలీ, జీతం బకాయిల వ్యవహారంలో రూ.5 వేలు లంచం డిమాండ్ చేశారు. ఇవ్వలేనని చెప్పినా ఎంపీడీవో వినకపోవడంతో శేషారావు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు వలపన్ని.. ఆయన రూ.5 వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఎంపీడీవోను పట్టుకున్నారు.
ఈ కేసుపై అప్పట్లో విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ కోర్టు లంచం తీసుకున్నారనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవంటూ 2005లో కేసును కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏసీబీ అధికారులు 2007లో హైకోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు న్యాయస్థానంలో ఎంపీడీవోపై నేరం రుజువు కావడంతో హైకోర్టు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే వాదనల సమయంలో తన వయసు 80 ఏళ్లని, తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని బత్తిన వెంకటేశ్వరరావు కోర్టుకు విన్నవించినా.. న్యాయమూర్తి తోసిపుచ్చారు. అయితే.. గరిష్ట శిక్షకు బదులు ఈ కేసులో బత్తినకు కనిష్ట శిక్ష విధించి ఊరట కల్పించారు. ఒక సెక్షన్ కింద ఆరు నెలలు, మరో సెక్షన్ కింద ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఏకకాలంలో ఈ శిక్షలు అనుభవించాలని స్పష్టం చేశారు. దీంతో ఆ వృద్ధుడికి నాటి తప్పుల పాపం వెంటాడి.. వృద్ధాప్యంలో జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి నెలకొంది.