ఉంగుటూరు రాజకీయ ముఖచిత్రం.. ఇటు జనసేన రాజు – అటు వైసీపీ కాపు

ఎమ్మెల్యే వాసుబాబు మీద పోటీకి దిగిన ధర్మరాజు బాగా డబ్బున్నవాడు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో విలసిల్లుతున్న శ్రీమంతుడు.

Advertisement
Update:2024-04-26 14:07 IST
ఉంగుటూరు రాజకీయ ముఖచిత్రం.. ఇటు జనసేన రాజు – అటు వైసీపీ కాపు
  • whatsapp icon

పాత పశ్చిమ గోదావరి జిల్లా గుర్తుందిగా! అందులో ఒక ఆకుపచ్చని ముక్కపేరు ఉంగుటూరు. ఈ నియోజకవర్గం ఇప్పుడు కొత్త ఏలూరు జిల్లాలోకి వస్తుంది. అక్కడ రెండు లక్షల ఇరవై వేల మంది ఓటర్లు ఉన్నారు. నామినేషన్లు వేయడంతో ఎన్నికల కోలాహలం రెట్టింపు అయింది. ఉంగుటూరు గురించే ఎందుకు మాట్లాడుకోవాలి..? ఆ అవసరం ఉంది. కాపుల పార్టీగా పేరుపడిన జనసేన ఇక్కడ ఒక క్షత్రియుణ్ణి–ప‌త్స‌మట్ల ధర్మరాజును అభ్యర్థిగా నిలబెట్టింది. రెడ్ల పార్టీగా ముద్రపడిన వైసీపీ ఒక కాపు– పుప్పాల శ్రీనివాసరావుని బరిలోకి దించింది. ఇతన్ని స్థానికులు వాసుబాబు అని పిలుస్తారు. 2019 ఎన్నికల్లో 33,650 ఓట్ల మెజార్టీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.

నియోజకవర్గంలో వాసుబాబుకి మంచి పేరుంది. ప్రజలకి అందుబాటులో ఉంటాడనీ, ప్రతీ పైసాకీ కక్కుర్తిపడడనీ జనం చెబుతుంటారు. అందుకే ఆయన్నే వైసీపీ ఎంపిక చేసింది. గణపవరం, నిడమ్రరు, ఉంగుటూరు, భీమడోలు ఇక్కడ ప్రధానమైన మండలాలు. ఎటు చూసినా పలకరించే పచ్చని పొలాలు, ఎగురుతున్న కొంగలు, కాయలతో వొరిగి ఉండే పెద్ద మామిడి చెట్లు, కొబ్బరితోటలు, చెరువులు, పంట కాల్వలతో కోస్తా దర్జాతో ఈ ప్రాంతం వెలిగిపోతూ ఉంటుంది. ఎమ్మెల్యే వాసుబాబు మీద పోటీకి దిగిన ధర్మరాజు బాగా డబ్బున్నవాడు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో విలసిల్లుతున్న శ్రీమంతుడు. అయితే ఉంగుటూరు సీటు జనసేనకి ఇవ్వడం దుర్మార్గం అని సీనియర్‌ తెలుగుదేశం నాయకుడు కోపంతో ఊగిపోయాడు. కొంత డబ్బుతో అతన్ని దారిలోకి తెచ్చుకున్నాడు ధర్మరాజు. పార్టీ ఫండ్‌గా పవన్‌ కళ్యాణ్‌కీ కొన్ని కోట్లు ఇచ్చాడని ఇక్కడ ప్రచారం జరుగుతోంది. ఉంగుటూరులో కాపు ఓటర్లు 50 వేల మంది ఉన్నారు. ఈ ఓటు జనసేన, వైసీపీ మధ్య చీలుతుంది. మాలమాదిగల ఓట్లే 40 వేలు, బీసీ వెలమలు 28 వేలు, కమ్మ 12 వేలు, రాజులు 10 వేలు ఉన్నారు. చదువుకుని, ఎంతో కొంత సంపాదిస్తూ, జగన్‌ సంక్షేమ పథకాల వల్ల లాభపడిన మాల మాదిగలు, ‘మా పార్టీ వైసీపీ, ఫ్యాన్‌ గుర్తుకే ఓటేస్తాం’ అంటున్నారు. మొగ్గు వైసీపీ వైపే ఉంది, గెలిచేది వాసుబాబే అంటున్నారు సామాన్య జనం.

జై జనసేన అంటూ ధర్మరాజు నామినేషన్‌ వేసినప్పుడు దాదాపు 15 వేల మంది జనం వచ్చారు. ఆర్భాటంగా ఆ కార్యక్రమం ముగిసింది. అక్కడి రాజులు, ధర్మరాజు వైపే గట్టిగా నిలబడి ఉన్నారు. పొత్తు పుణ్యమని కమ్మవాళ్లూ జనసేనకే ఓటు వేయాలి. అయితే, ఎస్సీలు, కాపులు, వెలమలు ఇక్కడ ఫలితాన్ని నిర్ణయిస్తారు. జై జగన్‌ అంటూ వాసుబాబు నామినేషన్‌ వేసినప్పుడు 40 వేల మంది జనం ఆయన వెంట నడిచారు. అందరికీ మంచినీళ్ల ప్యాకెట్లూ, మజ్జిగ ప్యాకెట్లూ పంచారు. మొత్తం అందరికీ మధ్యాహ్న భోజనం నారాయణపురంలో ఏర్పాటు చేశారు. 12 గంటల నుంచి సాయంత్రం 4 దాకా వడ్డిస్తూనే ఉన్నారు. వెజ్‌ బిరియానీ, అన్నం పెరుగు, సాంబారుతో భోజనాలు ముగిశాయి. వారం పదిరోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్‌ నిడమ్రరులో పెద్ద సభలో ప్రసంగించారు. దాంతో వైసీపీ కుర్రాళ్లలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ కోసం కాపులంతా జనసేన వెనకే ఉంటారని అనుకోవడం సరికాదని చెప్పడానికి ఉంగుటూరు ఒక మంచి ఉదాహరణ. గోదావరి జిల్లాలన్నీ వచ్చి టీడీపీ, జనసేన, బీజేపీ ఒళ్లో పడిపోతాయని జరుగుతున్న అతి ప్రచారంలోనూ పసలేదనీ, నిజం అసలే లేదని క్లియర్‌గా తెలిసిపోతోంది.

మరోపక్క ప్రభుత్వ వలంటీర్లు అందరూ ఇక్కడ రాజీనామాలు చేశారు. పార్టీ అభ్యర్థి విజయం కోసం వాళ్లు గట్టిగా పనిచేస్తున్నారు. మహిళల్లో ఎక్కువ మంది వాసుబాబుకి ఓటు వెయ్యడానికి సుముఖంగా ఉన్నారు. ఇది తెలిసిన తెలుగుదేశం నోట్ల కట్టల్ని నమ్ముకోవడమే మంచిదని భావించి, చీకటిపడ్డాక డబ్బు మూటలు విప్పడానికి నమ్మకస్తుల్ని పోగుజేస్తోంది. ఒక్కోసారి డబ్బు కూడా గెలవవచ్చు. జన ప్రభంజనంలో నోట్ల కట్టలు గాలికి కొట్టుకుపోనూ వచ్చు! ధర్మరాజు అధర్మ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. వాసుబాబు సామాన్య జనాన్ని నమ్ముకున్నాడు.

Tags:    
Advertisement

Similar News