ప్రత్యేక హోదా.. కాంగ్రెస్ మాట నిలబెట్టుకుంటుందా..?

ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు, సీట్లు వస్తాయా లేవా అనే విషయాన్ని పక్కనపెడితే, ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ఆ పార్టీ మరోసారి హామీ ఇవ్వడం మాత్రం విశేషం.

Advertisement
Update:2023-02-26 08:42 IST

ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీ ఎప్పటికీ నెరవేర్చదనే విషయం తెలిసిపోయింది. ఏపీలో మొత్తానికి మొత్తం లోక్ సభ సీట్లు ఒకే పార్టీకి వచ్చినా ఆ పార్టీ పార్లమెంట్ ముందు తొడగొట్టే అవకాశం లేదు, కేంద్రాన్ని మెడలు వంచేంత సీన్ లేదని ఈపాటికే ఏపీ ప్రజలకు తెలిసొచ్చింది. మరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే ఏం చేయాలి..? మళ్లీ మాకో ఛాన్స్ ఇవ్వండి అంటోది కాంగ్రెస్ పార్టీ. రాయపూర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాల్లో ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయ తీర్మానంగా ప్రవేశ పెట్టారు ఆంధ్రప్రదేశ్‌ కి ప్రత్యేక హోదా ఇచ్చే అంశానికి కట్టుబడి ఉన్నట్టు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది.

ఏపీతోపాటు..

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు.. కొండ ప్రాంతాలున్న రాష్ట్రాలకు ప్రత్యేక తోడ్పాటు, సహాయం లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని తీర్మానంలో పేర్కొంది కాంగ్రెస్‌. ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌ కు ప్రత్యేక హోదాను పునరుద్దరిస్తామని ప్రకటించింది. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌ కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను కల్పిస్తామని తీర్మానంలో ప్రస్తావించారు. లద్దాక్ ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ పరిధిలోకి చేర్చి, ఆ ప్రాంత ప్రజల హక్కులను పరిరక్షిస్తామని కాంగ్రెస్‌ ప్లీనరీలో పేర్కొంది.

ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు, సీట్లు వస్తాయా లేవా అనే విషయాన్ని పక్కనపెడితే, ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ఆ పార్టీ మరోసారి హామీ ఇవ్వడం మాత్రం విశేషం. ప్రత్యేక హోదా హామీతో ఏపీలో కాంగ్రెస్ బలం పెరుగుతుందన్న గ్యారెంటీ లేదు. కానీ విభజన సమయంలో ఇచ్చిన హామీకి కాంగ్రెస్ కట్టుబడి ఉండటం విశేషం. ప్రత్యేక హోదా ప్రకటన విషయంలో ఆనాడు బీజేపీ ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలుసు. హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని డిమాండ్ చేసిన ఆ నోళ్లు ఆ తర్వాత మూతబడ్డాయి. ఆ తర్వాత ఏపీలో కాంగ్రెస్ కి పట్టినగతే బీజేపీకి కూడా పట్టినా నాయకులు మాత్రం కాషాయ కండువాలతో, నామినేటెడ్ పోస్ట్ లతో చలామణి అవుతున్నారు.

కాంగ్రెస్ కి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చినా రాకపోయినా, విపక్షాలతో కలసి కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా.. ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకుంటే మాత్రం ఏపీలో కాంగ్రెస్ కి జీవం వచ్చినట్టే లెక్క. ఏపీలోనే కాదు, హామీలు నిలబెట్టుకునే విషయంలో కాంగ్రెస్ ఇమేజ్ దేశవ్యాప్తంగా పెరుగుతుంది. ప్లీనరీ తీర్మానంతోనే సరిపెడతారా, గద్దెనెక్కే ఛాన్స్ వస్తే నిజంగానే హోదా ప్రకటిస్తారా.. ముందు ముందు తేలిపోతుంది.

Tags:    
Advertisement

Similar News