సలహాదారా..? స్వాహాదారా..? అలీ పదవిపై ఘాటు విమర్శలు..

ఇప్పటికే ఏపీ మీడియా సలహాదారుగా జివిడి కృష్ణ మోహన్, జాతీయ మీడియా సలహాదారుగా దేవులపల్లి అమర్ ఉన్నారని, ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీని నియమించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

Advertisement
Update:2022-10-28 14:19 IST

సినీ నటుడు అలీకి రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పదవి ఇవ్వడంతో ఇప్పుడు మళ్లీ ఏపీలో సలహాదారు పోస్ట్‌లపై చర్చ మొదలైంది. అసలెందుకీ సలహాదారులు, ఏమేం సలహాలిస్తారు, వాటి వల్ల ఉపయోగం ఎంత..? సలహాదారులకి ఇచ్చే జీతమెంత, అలవెన్స్ లు ఎంత..? ఆ ఖర్చు ఎవరు భరిస్తారు..? ఉద్యోగులకు జీతాలు పెంచమంటే ముందూ వెనకా ఆలోచిస్తున్న ప్రభుత్వం, సలహాదారు పదవులతో ఎందుకు వృథా ఖర్చు చేస్తున్నట్టు..? అంటూ సవాలక్ష ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఆ పోస్ట్‌లు వృథా అని, వారంతా సలహాదారులు కాదని, స్వాహాదారులంటూ మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి.

మీడియాకు ఇంతమందా..?

ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా అలీని వైసీపీ ప్రభుత్వం నియమించడం హాస్యాస్పదంగా ఉందన్నారు తులసిరెడ్డి. ఇప్పటికే ఏపీ మీడియా సలహాదారుగా జివిడి కృష్ణ మోహన్, జాతీయ మీడియా సలహాదారుగా దేవులపల్లి అమర్ ఉన్నారని, ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీని నియమించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఒక్క మీడియా రంగానికే ఇంతమంది సలహాదారుల్ని నియమించిన జగన్, మీడియాపై ఎప్పుడూ ఎందుకు చిర్రుబుర్రులాడుతుంటారని మండిపడ్డారు తులసిరెడ్డి.

జగన్ ప్రభుత్వంలో సలహాదారులు అనే పోస్ట్‌లకు విలువ లేకుండా పోయిందని విమర్శించారు తులసిరెడ్డి. రాజకీయ పునరావాసం కోసం ప్రజా ధనాన్ని అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారాయన. ఇప్పటికే ప్రభుత్వానికి 50 మందికి పైగా సలహాదారులు ఉన్నారని, రామచంద్రమూర్తి లాంటి కొందరు పని లేకుండా గౌరవ వేతనం తీసుకోవడం సమంజసం కాదని రాజీనామా చేశారని గుర్తు చేశారు. సలహాదారుల విషయంలో హైకోర్టు కూడా అక్షింతలు వేసిందని, అయినా ప్రభుత్వంలో మార్పు రాలేదన్నారు. కోర్టుతో మొట్టికాయలు తినకుండా సలహాలిచ్చేవారిని జగన్ ప్రత్యేకంగా నియమించుకోవాలని ఎద్దేవా చేశారు.

Tags:    
Advertisement

Similar News