ఇది ట్రైలర్ మాత్రమేనా..?
పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి ఇద్దరు ధర్మవరం నియోజకవర్గంలో టికెట్ కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు. టీడీపీ-బీజేపీ పొత్తుంటే బీజేపీ తరపున సూరి పోటీచేయటం ఖాయం.
అనంతపురం జిల్లా నేతలు పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి మధ్య తీవ్రస్థాయిలో వివాదం రేగింది. పరిటాలేమో టీడీపీ నేత, వరదాపురమేమో బీజేపీ నేత. అయినా ఇద్దరి మధ్య గొడవైంది. దాంతో పై ఇద్దరి మద్దతుదారుల మధ్య పెద్ద రగడే జరిగింది. కారణం ఏమిటంటే ..పెనుకొండ నియోజకవర్గంలో రా..కదలిరా పేరుతో జరిగిన బహిరంగసభలో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. చంద్రబాబు సభకు జనసమీకరణ చేయాల్సొచ్చింది. ఈ సందర్భంగానే పై ఇద్దరు నేతల మధ్య పెద్ద గొడవే అయ్యింది.
చంద్రబాబు సభకు బీజేపీ నేత వరదాపురం సూరి జనాలను తరలించటంపై శ్రీరామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సభ జరిగే ప్రాంతంలోని బత్తెలపల్లి గ్రామం వద్ద జనాలను తరలిస్తున్న సూరి వాహనాలను శ్రీరామ్ మద్దతుదారులు అడ్డుకున్నారు. దాంతో రెండువైపులా మాటమాట పెరిగి దాడులుచేసి కొట్టుకున్నారు. నిజానికి చంద్రబాబు బహిరంగసభకు జనాలను తరలించాల్సిన అవసరం సూరికి లేదు. ఎందుకంటే టీడీపీ, బీజేపీ మిత్రపక్షాలు కాదు. అయినా జనాలను ఎందుకు తరలించాల్సొచ్చింది ?
ఎందుకంటే పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి ఇద్దరు ధర్మవరం నియోజకవర్గంలో టికెట్ కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు. టీడీపీ-బీజేపీ పొత్తుంటే బీజేపీ తరపున సూరి పోటీచేయటం ఖాయం. అప్పుడు శ్రీరామ్ ఎలా స్పందిస్తారో అనే టెన్షన్ పెరిగిపోతోంది. ఒకవేళ పొత్తులేకపోతే సూరి బీజేపీలో నుండి బయటకు వచ్చేసి టీడీపీలో చేరి టికెట్ తీసుకుని పోటీచేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో పొత్తులతో సంబంధంలేకుండా ధర్మవరం నుండి శ్రీరామ్ పోటీచేయటానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. సూరికి టికెట్ దక్కకుండా అడ్డుకుంటే చంద్రబాబు తనకే టికెట్ ఇస్తారన్నది శ్రీరామ్ ఆలోచన. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సభకు జనాలను తరలిస్తున్న సూరితో శ్రీరామ్‌కు గొడవైంది.
ఇప్పుడు బత్తెలపల్లి గ్రామం దగ్గర జరిగిన గొడవ జస్ట్ ట్రైలర్ మాత్రమే అనిపిస్తోంది. రేపు గనుక సూరి టీడీపీలో చేరినా లేదా టికెట్ తెచ్చుకున్నా అంతే సంగతులు. అర్ధ, అంగబలాల్లో సూరి-శ్రీరామ్ ఇద్దరు దాదాపు సమానస్థాయనే చెప్పాలి. ఇద్దరికీ సపరేటుగా వర్గాలున్నాయి. దాంతో టికెట్ తెచ్చుకున్నా సూరి ప్రచారం చేసుకోవటం అంత తేలికకాదు. ఒకవేళ ఇద్దరూ పోటీలో ఉంటే నియోజకవర్గంలో ప్రతిరోజు మంటలు మండటం మాత్రం ఖాయం. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.