వైసీపీ ఎమ్మెల్యేపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
ఈ కేసు విచారణకు నిందితులు రాజకీయ పలుకుబడితో అడ్డుపడుతున్నారంటూ మృతురాలి సోదరుడు బత్తుల వాసు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్‌పై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు అందింది. అదనపు కట్నం కోసం తన సోదరిని అత్తింటివారు చంపేశారని.. ఈ కేసులో నిందితులకు వైసీపీ ఎమ్మెల్యే అండగా ఉంటున్నారని మృతురాలి సోదరుడు బత్తుల వాసు ఫిర్యాదు చేశారు.
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం సోమిదేవిపల్లికి చెందిన స్వాతికి.. ఒంగోలు నగరానికి చెందిన శ్రీకాంత్‌తో 2020లో వివాహం జరిగింది. ఇద్దరూ సాప్ట్‌వేర్ ఇంజనీర్లే. కోవిడ్ కాలంలో ఇద్దరూ ఇంటి వద్ద నుంచే పని చేస్తున్న సమయంలో 2021 సెప్టెంబర్‌లో స్వాతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. స్వాతి ఆత్మహత్య చేసుకున్నట్టు భర్త పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే స్వాతి శరీరంపై గాయాలుండడంతో వరకట్నం కోసం వేధించి అత్తింటివారే చంపేశారని స్వాతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ కేసులో శ్రీకాంత్, అతడి తల్లిదండ్రులు, మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయగా అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ కేసు విచారణకు నిందితులు రాజకీయ పలుకుబడితో అడ్డుపడుతున్నారంటూ మృతురాలి సోదరుడు బత్తుల వాసు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. నిందితులకు వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ అండగా నిలుస్తున్నారని ఫిర్యాదులో వివరించారు. ఈ కేసులో జోక్యం చేసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.