పార్వతీపురం.. ఎవరికో జగన్ వరం..?
నామినేటెడ్ పోస్టు దక్కినా సీటు రేసు నుంచి ప్రసన్నకుమార్ పక్కకి జరగలేదు. సిట్టింగ్‌తో సీటు పోరు సాగుతుండగానే ఎస్సీ కమిషన్ సభ్యురాలిగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి తన ప్రయత్నాలు ఆరంభించారు.
మన్యం జిల్లా కేంద్రమైన పార్వతీపురం నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా అధికార వైసీపీలో ముగ్గురు మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో ఎవరికి సీటు దక్కుతుందో తెలియని టెన్షన్ నెలకొంది. భారీ మెజారిటీతో 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై గెలిచి ఎమ్మెల్యే అయిన అలజంగి జోగారావుకి మొదట్లో నియోజకవర్గంలో పోటీయే లేదు. అయితే నాలుగేళ్ల అధికారంలో అవినీతి ఆరోపణలు తీవ్రం కావడంతో ఐ-ప్యాక్ నివేదికలు అధిష్టానానికి చేరాయి. ఎమ్మెల్యే పనితీరు బాగాలేదని ఐ-ప్యాక్ రిపోర్టు ఇచ్చిందని తెలిశాక ఆశావహులు మళ్లీ తమ టికెట్ ప్రయత్నాలు మొదలుపెట్టారు.
2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన జమ్మాన ప్రసన్నకుమార్ ఒక్కరే ఇప్పటివరకూ సిట్టింగ్ ఎమ్మెల్యే అలజంగి జోగారావుకి పోటీ అనుకుంటే.. మరొకరు కూడా తెరపైకి వచ్చారు. సిట్టింగ్ సీటు గల్లంతు అవుతుందనే సమాచారంతో మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి కూడా వైసీపీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. పార్వతీపురం టీడీపీ ఇన్చార్జిగా బోనెల విజయచంద్రని ప్రకటించి తమలో సీటు పోటీ లేదని క్లారిటీ ఇచ్చేసింది. వైసీపీలో మాత్రం సీటు కోసం త్రిముఖ పోరు సాగుతోంది.
జమ్మాన ప్రసన్నకుమార్ 2014లో వైసీపీ టికెట్ పొంది పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో సీటు అలజంగి జోగారావుకి దక్కింది. దీంతో అధిష్టానం టిడ్కో చైర్మన్ పదవిని జమ్మాన ప్రసన్నకుమార్‌కి కట్టబెట్టింది. నామినేటెడ్ పోస్టు దక్కినా సీటు రేసు నుంచి ప్రసన్నకుమార్ పక్కకి జరగలేదు. సిట్టింగ్‌తో సీటు పోరు సాగుతుండగానే ఎస్సీ కమిషన్ సభ్యురాలిగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి తన ప్రయత్నాలు ఆరంభించారు.
ఐ-ప్యాక్ నివేదికలు, సిట్టింగ్‌లపై సర్వేలన్నీ పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావుకి వ్యతిరేకంగా ఉండడంతో.. అభ్యర్థిని మార్చడానికి వైసీపీ నిర్ణయించుకుందని సమాచారం. అయితే ఆర్థికబలానికి తోడు ప్రజాబలం కూడా సంపాదించుకున్న అలజంగి జోగారావుని పక్కనబెడితే దెబ్బకొట్టే అవకాశాలున్నాయని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ముగ్గురు పోటీలో ఎవరికి టికెట్ దక్కుతుందో అనే టెన్షన్ కేడర్‌లో నెలకొంది.