నేడు విద్యా దీవెన నిధుల విడుదల.. 11.02 లక్షల మంది విద్యార్థులకు రూ. 694 కోట్లు
ఆర్థిక స్థోమత లేక ఏ విద్యార్థి కూడా ఉన్నత చదువులకు దూరం కాకూడదనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంటును అమలు చేస్తోంది.
జగనన్న విద్యా దీవెన పథకం కింద విద్యార్థులకు నిధులను ఇవ్వాళ విడుదల చేయనున్నారు. జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి 11.02 లక్షల మంది విద్యార్థులకు రూ. 694 కోట్లను బుధవారం సీఎం వైఎస్ జగన్ అన్నమయ్య జిల్లా మదనపల్లెలలో నిర్వహించే కార్యక్రమంలో బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఈ నిధులు నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలోకి చేరనున్నది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా ఇప్పటి వరకు రూ. 12,401 కోట్లను విడుదల చేసింది.
ఆర్థిక స్థోమత లేక ఏ విద్యార్థి కూడా ఉన్నత చదువులకు దూరం కాకూడదనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంటును అమలు చేస్తోంది. కాలేజీ ఫీజు మొత్తం ఎంత ఉన్నా.. తల్లిదండ్రులకు భారం కాకుండా ప్రభుత్వమే దానిని భరిస్తోంది. ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఫీజు డబ్బును విడుదల చేయడం ద్వారా కాలేజీ యాజమాన్యాలకు కూడా ప్రయోజనం చేకూరుతున్నది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కాలేజీ ఫీజు లక్షల్లో ఉన్నా.. కేవలం రూ. 35 వేలు మాత్రమే ఇచ్చింది. ఆ నిధులు కూడా సకాలంలో ఇవ్వకపోవడం వల్ల తల్లిదండ్రులు అప్పులపాలయ్యారు. చాలా మంది విద్యార్థులు చదువులు మధ్యలోనే ఆపేసేవారు.
కాగా, వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత 2017 నుంచి ఉన్న బకాయిలు రూ. 1,778 కోట్లతో కలిపి జగనన్న విద్యా దీవెన కింద రూ. 9,052 కోట్లు, వసతి దీవెన కింద రూ. 3,349 కోట్లు విద్యార్థులకు అందించింది. ఈ రెండు పథకాల ద్వారా ఇప్పటి వరకు రూ. 12,401 కోట్లు ప్రభుత్వం సాయం అందించింది. ఎటువంటి ఆటంకం లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తుండటంతో పేద విద్యార్థులు నిరాటంకంగా విద్యనభ్యసిస్తున్నారు.
ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజులన్నీ క్రమం తప్పకుండా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. మరోవైపు పేద విద్యార్థులు భోజనం, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా జగనన్న వసతి దీవెన కింద ఏటా రెండు వాయిదాల్లో అదనంగా నిధులు జమ చేస్తోంది. ఐటీఐ విద్యార్థులకు రూ. 10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్ , మెడిసిన్ విద్యార్థులకు రూ. 20 వేలు ఆర్థిక సాయం చేస్తోంది.