నేడు 5 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయనున్న సీఎం వైఎస్ జగన్
శాంసంగ్ సంస్థ తయారు చేసిన ఈ ట్యాబ్‌లలో బైజూస్‌కు చెందిన ఎడ్యుకేషన్ మెటీరియల్ ఉచితంగా లభించనున్నది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో బృహత్తర కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా యడ్లపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఉదయం 11 గంటలకు జగన్ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు అందించాలని గతంలోనే నిర్ణయించారు. పాఠశాలల్లో సాంప్రదాయ పద్దతుల్లో కాకుండా సరికొత్త ఈ-లెర్నింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలనే లక్ష్యంలో భాగంగానే ఈ-ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులకు లబ్ది చేకూరనున్నట్లు అధికారులు తెలిపారు. శాంసంగ్ సంస్థ తయారు చేసిన ఈ ట్యాబ్‌లలో బైజూస్‌కు చెందిన ఎడ్యుకేషన్ మెటీరియల్ ఉచితంగా లభించనున్నది. ఈ కంటెంట్ కోసం ప్రభుత్వం రూ. 686 కోట్లు ఖర్చు చేసింది. కానీ విద్యార్థులకు ట్యాబ్, కంటెంట్ ఉచితంగానే అందించనున్నారు. జగన్ ఈ కార్యక్రమాన్ని చండూరు మండలం యడ్లపల్లి జెడ్పీ పాఠశాలలో ప్రారంభిస్తారు. అక్కడి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో మాత్రం వారం రోజుల్లోగా ఈ ట్యాబ్‌ల పంపిణీ పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
ఈ ట్యాబ్‌ల వల్ల విద్యార్థులు 24/7 తమ డౌట్లను తీర్చుకునే అవకాశం ఉంటుంది. క్లాస్ రూమ్‌లలోనే కాకుండా ఇంటి దగ్గర కూడా బైజూస్ కంటెంట్ ద్వారా చదువుకునే వెసులు బాటు ఉంటుంది. ముఖ్యంగా పేద విద్యార్థులు ఇతరులతో పోటీ పడేందుకు ఈ ట్యాబ్‌లు ఎంతగానే ఉపయోగపడనున్నాయి. ఇది వారి బంగారు భవిష్యత్‌కు ఒక మంచి మార్గంగా ఉండబోతోందని విశ్లేషకులు అంటున్నారు. 8వ తరగతి చదవుతున్న ప్రతీ విద్యార్థికి ట్యాబ్ అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. అంతే కాకుండా వాళ్లు క్లాస్ మారితే ట్యాబ్‌లోని బైజూస కంటెంట్ కూడా మారనున్నది.కేవలం ఇంటర్నెట్ సహాయంతోనే కాకుండా ఆఫ్‌లైన్‌లో కూడా కంటెంట్‌ను వీక్షించే అవకాశం ఉన్నది.
ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు సీబీఎస్‌ఈ సిలబస్ ద్వారా 2025లో పదవ తరగతి పరీక్షలు రాయబోతున్నారు. వాళ్లు మరింత సమర్థవంతంగా ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాయడానికి ఈ ట్యాబ్ ఉపయోగపడనున్నది. ఇప్పటికే 8, 9 తరగతులకు సంబంధించిన కంటెంట్ ఈ ట్యాబ్‌లలో లోడ్ చేశారు. ఇంటర్నెట్ లేకపోయినా ట్యాబ్‌లలోని మెటీరియల్‌ను విద్యార్థులు యాక్సెస్ చేసే అవకాశం ఉంది. మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, జియాలజీ, సివిక్స్, ఇంగ్లీష్, తెలుగు సబ్జెక్టులకు సంబంధించిన ఈ-కంటెంట్ ఉన్నది. మొత్తం 67 చాప్టర్లు ఉండగా.. 300 వీడియోలు, 472 కాన్సెప్ట్‌లతో పాటు 168 క్వశ్చన్ బ్యాంక్స్ ఈ ట్యాబ్‌లలో ఉన్నాయి.