ఏపీ రైతులకు సీఎం వైఎస్ జగన్ దీపావళి కానుక.. ఇకపై పూర్తి హక్కులు వారికే
రాష్ట్ర వ్యాప్తంగా 355 గ్రామాల్లోని 18,889 సర్వే నెంబర్లలో.. 35,669 ఎకరాల భూములు 22(ఏ) నిషేధిత జాబితాలో ఉండగా.. ఇప్పుడు వాటన్నింటినీ డీనోటిఫై చేస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు.
ఏపీలోని రైతులకు సీఎం వైఎస్ జగన్ దీపావళికి ముందే శుభవార్త చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల ఎకరాల్లోని భూములు ఇన్నాళ్లూ వివాదాల్లో చిక్కుకొని నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయాయి. వాటిలో సాగు చేసుకోవడానికి, అమ్మడానికి, కొనడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి భూములను డీనోటిఫై చేసి.. రైతులకు శాశ్వత హక్కులు కల్పిస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. గురువారం అవనిగడ్డలో జరిగిన సభలో ఈ మేరకు జగన్ క్లియరెన్స్ ఇచ్చారు. డీనోటిఫై చేసిన భూములపై రైతులకు సర్వ హక్కులు ఇవ్వడమే కాకుండా వాటికి భూ పట్టాలు కూడా కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 355 గ్రామాల్లోని 18,889 సర్వే నెంబర్లలో.. 35,669 ఎకరాల భూములు 22(ఏ) నిషేధిత జాబితాలో ఉండగా.. ఇప్పుడు వాటన్నింటినీ డీనోటిఫై చేస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు. దీని వల్ల ఇప్పటికిప్పుడు 22,042 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా రాష్ట్రంలోని భూములకు సంబంధించి కచ్చితమైన రికార్డులు లేవని, దీని వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వందేళ్ల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భూసర్వేను మహా యజ్ఞంలా చేస్తున్నామని.. ఇందుకోసం 15 వేల మంది సర్వేయర్లను రిక్రూట్ చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
సర్వే కోసం విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను ఉపయోగిస్తున్నామని.. అవసరమైన అత్యాధునిక పరికరాలను కూడా కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశామని సీఎం జగన్ చెప్పారు. నవంబర్ నెలాఖరు లోగా 1500 గ్రామాల్లో భూ సర్వే పూర్తవుతుందని.. అప్పుడు వాటికి సరిహద్దులు సరిచేసి హక్కు పత్రాలు అందిస్తామని అన్నారు. గ్రామాల్లోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గత ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేరుస్తూ 2016లో జీవో ఇచ్చింది. ఇప్పుడు ఆ భూములన్నీ డీనోటిఫై చేసి రైతులకు మేలు చేశామని సీఎం చెప్పుకొచ్చారు.
చంద్రబాబు తీసుకున్న ఈ చెత్త నిర్ణయాన్ని రద్దు చేసి రైతులకు మేలు చేశామని జగన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న భూసమస్యలకు వైసీపీ ప్రభుత్వం ఓ పరిష్కారం చూపిస్తుందని చెప్పారు. దేశానికి ఆదర్శంగా ఉండేలా రిజిస్ట్రేషన్, రికార్డులను నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రజలు మన పాలనకు, గత పాలనకు ఉన్న తేడాను గమనించాలని కోరారు.