టీడీపీకి ఆ ఒక్క హామీ మాత్రం ఇవ్వని సీఎం రమేష్
తాను టీడీపీని చీల్చే వ్యక్తిని కాదు అని సీఎం రమేష్ సూటిగా ఎక్కడా చెప్పలేదు. తన పేరును కేశినేని నాని ఎందుకు ప్రస్తావించారో తెలియదని, ఆ వ్యాఖ్యలను కాంప్లిమెంట్‌గా తీసుకుంటానని సీఎం రమేష్ చెప్పారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో పెద్ద చర్చకే దారి తీశాయి. కేశినేని నాని వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ స్పందన మరింత ఆసక్తిగా ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 40, 50 సీట్లు వస్తాయని,.. ఆ వెంటనే సీఎం రమేష్‌ను బీజేపీ రంగంలోకి దింపుతుందని... టీడీపీ ఎమ్మెల్యేలందరినీ సీఎం రమేష్ తీసుకెళ్తారని.. టీడీపీ ఉండదు, బీజేపీనే ప్రధాన ప్రతిపక్షం అవుతుందంటూ కేశినేని నాని ఆఫ్ ది రికార్డుగా విలేకర్ల వద్ద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పాలిట సీఎం రమేష్ మరో ఏకనాథ్ షిండే అవుతారని జోస్యం చెప్పారు.
ఈ వ్యాఖ్యలపై టీడీపీ మీడియా చానళ్లు చర్చను పెట్టాయి. టీడీపీలో లేని సీఎం రమేష్ అసలు ఏక్‌నాథ్ షిండే ఎలా అవుతారని మీడియా ప్రశ్నిస్తోంది. టీడీపీ గెలవకూడదన్న ఉద్దేశంతో కేశినేని నాని ఉన్నట్టుగా ఉందని చానళ్లు విమర్శిస్తున్నాయి. ఒక చానల్ నేరుగా సీఎం రమేష్‌తోనే కేశినేని వ్యాఖ్యలపై చర్చ పెట్టింది.
ఆ చర్చలో ఎంతగా ప్రయత్నించినా సీఎం రమేష్ మాత్రం తాను టీడీపీని చీల్చే వ్యక్తిని కాదు అని సూటిగా ఎక్కడా చెప్పలేదు. తన పేరును కేశినేని నాని ఎందుకు ప్రస్తావించారో తెలియదని, ఏదైనా కుటుంబంతో వివాదం ఉంటే వారువారు తేల్చుకోవాలి గానీ తనను లాగడం సరికాదన్నారు.
అర్థ బలం, అంగ బలం అన్నీ ఉన్న సీఎం రమేష్ ఏమైనా చేయగలడని, అందుకే బీజేపీ ఆయన్నే ఎంచుకుందని కేశినేని నాని చెబుతున్నారని.. దీన్ని మీరు సూటిగా ఖండిస్తారా అని చానల్ ప్రతినిధి ప్రశ్నించగా... సూటిగా ఖండిచకపోగా.. కేశినేని నాని చేసిన వ్యాఖ్యలను కాంప్లిమెంట్‌గా తీసుకుంటానని సీఎం రమేష్ చెప్పారు.
మీరు రాజకీయంగా పుట్టి పెరిగిన పార్టీని మీరే నాశనం చేయబోతున్నారని కేశినేని నాని చెబుతుంటే దాన్ని కాంప్లిమెంట్‌గా ఎలా తీసుకుంటారని మరోసారి చానల్ ప్రతినిధి ప్రశ్నించారు. సూటిగా ఖండిస్తారా లేదా అని మరోసారి ప్రశ్నించగా... అసలు ఇలాంటి గాసిప్‌లపై ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదంటూ సీఎం రమేష్ దాటవేశారు.
టీడీపీలో ప్రతిచోట సీఎం రమేష్ మనుషులున్నారని, చంద్రబాబు ఇంట్లో ఏం జరిగినా కూడా క్షణాల్లో సీఎం రమేష్‌కు తెలిసిపోతుందంటూ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలనూ కాంప్లిమెంట్‌గానే తీసుకుంటున్నట్టు సీఎం రమేష్ చెప్పడం విశేషం. రాజకీయాల్లో ఉన్నాక అవతలి పార్టీలో ఏం జరుగుతోంది అన్నది తెలుసుకునేందుకు ప్రయత్నించడం సాధారణమే అంటూ సీఎం రమేష్ మాట్లాడారు. '' నేనా ! ?, ఏక్ నాథ్ షిండేనా?!. టీడీపీని చీల్చడమా ?!.. ఛీ.. ఛీ'' అని సీఎం రమేష్ చెబుతారనుకుంటే ఆయన మరోలా మాట్లాడడం టీడీపీలో మరింత అనుమానాలు పెంచే అంశమే. ఇక్కడ సీఎం రమేష్‌కు అంత సీన్ లేకపోవచ్చు. కానీ ఆయనకు వెనుక బీజేపీ నిలబడితేనే కష్టం మరి!