బీజేపీలో ఉండి చంద్రబాబు రుణం తీర్చుకుంటున్న నేతలు
చంద్రబాబుకు అత్యంత అనుంగులైన సీఎం రమేష్, సుజనా చౌదరి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటికి టీడీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న వారిద్దరూ తమ వ్యాపారాలపై అధికారిక సోదాల నేపథ్యంలోనే పార్టీ మారారని ప్రచారం జరిగింది.
`ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మనతో పొత్తుకు ప్రయత్నిస్తుంది.. ఏమంటారు, మీ అభిప్రాయమేంటి` అని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆ పార్టీ ఏపీ నేతలను అడిగారట. పొత్తులో ముందుకెళితే మనకూ కొన్ని సీట్లు వస్తాయని వారు చెప్పారట. ఈ అంకం చూస్తే ఏపీ బీజేపీలోని చంద్రబాబు మనుషులు తమ ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసినట్లే. ఇలాంటి అవసరాలకు పనికొస్తారనే మరి చంద్రబాబు తన సొంతవారిని బీజేపీలోకి పంపింది.
2019 ఎన్నికల తర్వాతే స్కెచ్
2019 ఎన్నికలకు ముందు బీజేపీని దునుమాడారు చంద్రబాబు. ఆ సమయంలో బీజేపీ బద్ధశత్రువు కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా రాసుకుపూసుకు తిరిగారు. ఇదిలా ఉంటే చంద్రబాబుకు అత్యంత అనుంగులైన సీఎం రమేష్, సుజనా చౌదరి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటికి టీడీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న వారిద్దరూ తమ వ్యాపారాలపై అధికారిక సోదాల నేపథ్యంలోనే పార్టీ మారారని ప్రచారం జరిగింది. కానీ, వారిని చంద్రబాబే బీజేపీలోకి పంపారని చెబుతంటారు. ఆ మేరకు అవసరమైనప్పుడు చంద్రబాబుకు చేయూతనిస్తూ వచ్చారు. తాజాగా నిన్న అమిత్‌షా సుజనా చౌదరిని పొత్తు గురించి అడిగితే ఆయన పొత్తు ఉండాల్సిందేనని చెప్పారని వార్తలొచ్చాయి.
రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలూ ఆత్మబంధువే మరి
మరోవైపు చంద్రబాబుకు సొంత వదిన పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు. అంతకుముందు దశాబ్దాలుగా చంద్రబాబుతో ఎడమొహంగా ఉన్న ఆమె స్కిల్ కేసులో బాబు అరెస్టయి జైల్లో ఉన్నప్పుడు తన వంతు సాయం అందించారు. లోకేశ్ ఢిల్లీ వచ్చి అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోసం పడిగాపులు పడినప్పుడు పురందేశ్వరే పూనుకుని అపాయింట్‌మెంట్ ఇప్పించి, దగ్గరుండి మాట్లాడించడం తెలిసిందే. ఇలా ఎటు చూసినా ఏపీ బీజేపీలోని తన శ్రేయోభిలాషులు ఇప్పుడు రుణం తీర్చుకుంటారన్నది చంద్రబాబుకు తెలిసిందే. ఆయన కోరుకున్నది కూడా అదే.