ఆ పేపర్లు చదవొద్దు.. ఆ ఛానెళ్లు చూడొద్దు

పనిగట్టుకొని అదేపనిగా అబద్ధాలు రాసేవాళ్లు, చూపించేవాళ్లతో జాగ్రత్తగా ఉండాలన్నారు సీఎం జగన్. ఈనాడు, ఆంధ్రజ్యోతి చదవొద్దని, ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 చూడొద్దని చెప్పారు.

Advertisement
Update:2023-12-08 20:09 IST

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్.. ప్రతి ఒక్కరికీ పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. బాధితులందర్నీ ఆదుకుంటామన్నారు. అదే సమయంలో విపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. విపక్షాలకు తోడు వారి అనుకూల మీడియా కూడా అబద్ధాలు ప్రచారం చేస్తోందని, అసత్యాలను ప్రచురిస్తోందని అన్నారు జగన్. మనం యుద్ధం చేస్తోంది మారీచులతోనని, ఒక్క చంద్రబాబుతో మాత్రమే కాదని అన్నారు. పనిగట్టుకొని అదేపనిగా అబద్ధాలు రాసేవాళ్లు, చూపించేవాళ్లతో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి చదవొద్దని, ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 చూడొద్దని చెప్పారు సీఎం జగన్.

తుపాను ప్రభావానికి గురైన తిరుపతి, బాపట్ల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సీఎం జగన్ ఈరోజు పర్యటించారు. బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం, పాతనందాయపాలెంలో బాధితులు, రైతులతో నేరుగా మాట్లాడారు. బాధాకరమైన పరిస్థితుల్లోనూ ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు ఉన్నారని, ప్రభుత్వం తమకు అండగా నిలబడుతుందన్న నమ్మకం వారి చిరునవ్వులో కనిపిస్తోందని చెప్పారు జగన్. తమ ప్రభుత్వంలో మంచే జరుగుతుంది తప్ప.. ఏ ఒక్కరికీ చెడు జరగదని కచ్చితంగా చెబుతున్నానని అన్నారు జగన్.

జరిగిన నష్టం అపారమైనదని, ప్రభుత్వం తరపున ప్రకటించిన సాయం పారదర్శకంగా ప్రతి ఒక్కరికీ అందుతుందని హామీ ఇచ్చారు సీఎం జగన్. గత ప్రభుత్వాల కంటే మిన్నగా, ఎక్కువగా సాయం అందిస్తామని అన్నారు. ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రిగా తాను వచ్చి జరిగే పని చెడగొట్టి, అధికారులను తన చుట్టూ తిప్పుకొని, ఫొటోలకు పోజులిచ్చి, టీవీల్లోనూ, పేపర్లలోనూ రావాలని తాపత్రయపడనని... అలాంటి ముఖ్యమంత్రి ఇప్పుడు లేరని పరోక్షంగా చంద్రబాబుపై సెటైర్లు పేల్చారు. సంక్రాంతి నాటికి రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందజేస్తామన్నారు. తుపాను సాయం రాదని ఎవరైనా చెబితే ప్రజలు నమ్మొద్దన్నారు. మీ బిడ్డ ప్రభుత్వంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు.

గతంలో ఎప్పుడూ తుపాను బాధిత కుటుంబాలకు రూ.2500 సాయం అందించిన దాఖలాలు లేవని, తమ ప్రభుత్వంలోనే సాయం అందుతోందని చెప్పారు సీఎం జగన్. 25కేజీల బియ్యంతోపాటు ఇతర నిత్యావసరాలు కూడా ప్రతి ఇంటికి అందిస్తామన్నారు. వాలంటీర్లు దగ్గరుండి ఈ సాయం అందేలా చర్యలు తీసుకుంటారని భరోసా ఇచ్చారాయన. 

Tags:    
Advertisement

Similar News