విశాఖకు జగన్.. పాలనా రాజధానిలో అభివృద్ధి పనుల సందడి

ఇనార్బిట్‌ మాల్‌ కు శంకుస్థాపన అనంతరం అదే ప్రాంగణంలో విశాఖ ప్రజలకు మౌలిక సదుపాయాలు, నగర సుందరీకరణ, వివిధ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు సీఎం జగన్‌ భూమి పూజ చేస్తారు.

Advertisement
Update:2023-07-31 06:50 IST

600కోట్ల రూపాయల వ్యయంతో రహేజా గ్రూప్ నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్ కు శంకుస్థాపన.

50కి పైగా పనులకు భూమిపూజ.

ఆంధ్రా యూనివర్శిటీలో నాలుగు కొత్త ప్రాజెక్ట్ ల ప్రారంభం..

ఆగస్ట్-1న వీటన్నిటికీ ముహూర్తం కుదిరింది. సీఎం జగన్ ఆగస్ట్-1న విశాఖ పర్యటన సందర్భంగా ఈ కార్యక్రమాలన్నిటికీ శ్రీకారం చుడతారు. దీంతో రెండురోజుల ముందునుంచే విశాఖలో సందడి మొదలైంది. ఆమధ్య విశాఖ గ్లోబల్ సమ్మిట్ తర్వాత పాలనా రాజధాని పెద్దగా చర్చల్లోకి రాలేదు. మరోసారి ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం విశాఖకు వెళ్తున్నారు సీఎం జగన్.

ఉపాధికి విశాఖను రాజధాని చేస్తానని గతంలోనే ప్రకటించిన సీఎం జగన్.. అక్కడ పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలిస్తామన్నారు. 17ఎకరాల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్ నిర్మిస్తోంది రహేజా గ్రూప్. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని సాలిగ్రామపురంలో పోర్ట్ అథారిటీకి చెందిన స్థలంలో ఇనార్బిట్ మాల్ నిర్మిస్తారు. మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. దీని ద్వారా 5వేలమందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణంలో భాగంగా ఐటీ టవర్స్‌ ను కూడా ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌, రహేజా గ్రూప్‌ ప్రతినిధులకు సూచించారు. దీనిపై కంపెనీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

రూ.135.88 కోట్లతో జీవీఎంసీ ప్రాజెక్టులు

ఇనార్బిట్‌ మాల్‌ కు శంకుస్థాపన అనంతరం అదే ప్రాంగణంలో విశాఖ ప్రజలకు మౌలిక సదుపాయాలు, నగర సుందరీకరణ, వివిధ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు సీఎం జగన్‌ భూమి పూజ చేస్తారు. అమృత్‌ 2.0, స్మార్ట్‌ సిటీ, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.135.88 కోట్లతో చేపట్టబోతున్న 50 పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. మురికివాడల అభివృద్ధి పనులు, తాగునీటి ప్రాజెక్ట్ లు, చెరువుల అభివృద్ధి పనులు, ఈట్ స్ట్రీట్, స్మార్ట్ స్ట్రీట్ పనులకు కూడా సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు.

ఆంధ్రా యూనివర్శిటీలో రూ.129 కోట్లతో చేపట్టిన కీలక ప్రాజెక్టులను సీఎం జగన్ అదేరోజు ప్రారంభిస్తారు. ఏయూలో రూ.21 కోట్లతో ఏర్పాటు చేసిన ఏయూ స్టార్టప్‌ అండ్‌ టెక్నాలజీ ఇంక్యుబేషన్‌ హబ్‌ ని ప్రారంభిస్తారు. ఇందులో ప్రస్తుతం 121 స్టార్టప్‌ కంపెనీలకు చోటు కల్పించారు. రూ.44 కోట్లతో బయోటెక్, ఫార్మా, జెనోమిక్స్‌ ఇంక్యుబేషన్, టెస్టింగ్‌ ల్యాబ్‌ కోసం నిర్మించిన ఎలిమెంట్‌ (ఏయూ ఫార్మా ఇంక్యుబేషన్‌ అండ్‌ బయోలాజికల్‌ మానిటరింగ్‌ హబ్‌)ని కూడా ప్రారంభిస్తారు. ఏయూ డిజిటల్‌ జోన్‌ అండ్‌ స్మార్ట్‌ క్లాస్‌ రూమ్స్‌ కాంప్లెక్స్‌, ఏయూ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌, ఏయూ అవంతి ఆక్వాకల్చర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ స్కిల్‌ హబ్‌ ని కూడా సీఎం జగన్ ప్రారంభిస్తారు. 

Tags:    
Advertisement

Similar News