నేడు వైయస్సార్ వాహన మిత్ర సొమ్ము జమ

2, 61,516 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున నగదు బదిలీ చేస్తారు.

Advertisement
Update:2022-07-15 07:21 IST

నేడు వైయస్సార్ వాహన మిత్ర పథకం కింద లబ్ధిదారులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగదును జమ చేయనున్నారు. విశాఖపట్నంలో బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోనికి నేరుగా ఈ డబ్బును జమ చేస్తారు. 2, 61,516 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున నగదు బదిలీ చేస్తారు.

వైయస్సార్ వాహన మిత్ర కింద ఈసారి 261.5 కోట్ల రూపాయలని ఆర్థిక సాయంగా అందజేస్తున్నారు. ఇది నాలుగో విడత. ఇప్పటికే మూడుసార్లు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్సార్ వాహన మిత్ర పథకం కింద ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ప్రస్తుతం ఇచ్చే నిధులతో కలిపి ఇప్పటివరకు వైయస్సార్ వాహన మిత్ర కింద లబ్ధిదారులకు మొత్తం 1,025 కోట్ల రూపాయలను జగన్ ప్రభుత్వం జమ చేసింది.

లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే పవిత్ర బాధ్యతను మోస్తూ, తమ బతుకుబండి లాగడానికి ఇబ్బంది పడుతున్న డ్రైవర్లకు బాసటగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. సొంతంగా వాహనం కలిగిన ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ఇలా నగదు బదిలీ పథకం దేశంలోనే మరి ఎక్కడా లేదని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కో డ్రైవర్ కు ఈ పథకం కింద మొత్తం 40 వేల రూపాయలు అందిందని ప్రభుత్వం గుర్తు చేస్తోంది.

వైయ‌స్సార్ వాహన మిత్రకు సంబంధించి సలహాలు కానీ, మరేవైనా ఫిర్యాదులు ఉంటే 1902 టోల్ ఫ్రీ నెంబర్ కు సంప్రదించవచ్చని ప్రభుత్వం వివరించింది. ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు ఇన్సూరెన్స్, ఫిట్ నెస్ సర్టిఫికెట్లు లేని కారణంగా చలాన్లు కట్టే పరిస్థితి రాకూడదని, వాళ్లంతా క్షేమంగా ఉండాలని, ప్రయాణికులను కూడా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేలా బాధ్యత స్వీకరించాలని ఏపీ ప్రభుత్వం డ్రైవర్లకు విజ్ఞప్తి చేసింది.

Tags:    
Advertisement

Similar News