వైసీపీ ఎమ్మెల్యేలలో వణుకు.. ఈనెల 14న జగన్ కీలక రివ్యూ
గడప గడపకు ఎమ్మెల్యేలు వెళ్లాల్సిందేనంటున్నారు సీఎం జగన్. ఐప్యాక్ అనే పేరుతో వేగులను పెట్టి వారి పనితీరు మదింపు చేస్తున్నారు. దాన్ని బట్టే వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు ఉంటుందని చెబుతున్నారు.
గడప గడపపై వర్క్ షాప్ అనగానే వైసీపీ ఎమ్మెల్యేలలో వణుకు మొదలవుతోంది. తొలి వర్క్ షాప్ లో 55మందికి క్లాస్ తీసుకున్నారు జగన్, రెండో వర్క్ షాప్ లో ఏకంగా 27మంది ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లు చదివి వినిపించి కాస్త ఘాటు హెచ్చరికలు చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సమీక్ష. ఈనెల 14న గడప గడపపై వర్క్ షాప్ నిర్వహించబోతున్నారు సీఎం జగన్. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి ఎవరికి తలంటుతారో, ఎవరిని మెచ్చుకుంటారో, ఏ సర్వే రిపోర్ట్ చదివి వినిపిస్తారో అని ఎమ్మెల్యేలలో ఆందోళన మొదలైంది.
గడప గడపే గీటురాయి..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా ఎమ్మెల్యేల వద్దకు సమస్యలు రావడం, వాటిని పరిష్కరించడం చాలా వరకు తగ్గిపోయాయి. ఏ ఇబ్బంది ఉన్నా సచివాలయంలో దరఖాస్తు చేస్తే టైమ్ బౌండ్ పెట్టి మరీ పరిష్కరించాల్సిన సందర్భం. ఒకవేళ కుదరకపోతే మీ పని కాదు అని తేల్చి చెప్పేస్తారు. అలాంటి సమయంలోనే ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. ఒకసారి సచివాలయంలో పని కాదు అని చెప్పేసిన తర్వాత రాజకీయ నాయకుల రికమండేషన్లు కూడా పనిచేయడం లేదు. సంక్షేమ పథకాల్లో చేతివాటం కుదరట్లేదు. ఒకరకంగా ఇది మంచి పరిణామమే అయినా ఎమ్మెల్యేలకు స్థానికంగా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఇలాంటి టైమ్ లో వారు గడప గడపకు వెళ్తే అక్కడక్కడా అసంతృప్తులు నిలదీస్తున్నారు. కానీ గడప గడపకు వెళ్లాల్సిందేనంటున్నారు సీఎం జగన్. ఐప్యాక్ అనే పేరుతో వేగులను పెట్టి మరీ వారి పనితీరు మదింపు చేస్తున్నారు. దాన్ని బట్టే వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు ఉంటుందని చెబుతున్నారు.
ఎన్నికలకు సిద్ధమైనట్టేనా..?
ఏపీలో ముందస్తు ఎన్నికల వ్యూహం లేకపోయినా ఎన్నికలకు మాత్రం ఆయన ముందుగానే సిద్ధమవుతున్నారు. దాదాపు రెండేళ్ల ముందుగానే గడప గడప కార్యక్రమాన్ని రూపొందించారు. ఎన్నికల ఏడాదిలో మరింత స్పీడ్ పెంచాలని ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు. ప్రతి గడప తొక్కి ప్రభుత్వం చేస్తున్న మంచిని వారికి వివరించాలని చెబుతున్నారు. ఎమ్మెల్యేలు ఇతర వ్యాపకాల్లో బిజీగా ఉంటూ, అనుచరులను, బంధువులను ప్రజల్లోకి పంపిస్తే కుదరదని తేల్చి చెప్పారు. గతంలో రెండుసార్లు సమీక్ష నిర్వహించి తప్పొప్పులు వివరించారు. ఇప్పుడు మూడోసారి సమీక్ష మరింత ఘాటుగా ఉంటుందని సమాచారం.
మరోవైపు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలున్నచోట్ల వైసీపీ అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు జగన్. మరి వైసీపీలో సిటింగ్ లందరికీ టికెట్లు ఖాయమేనా అంటే అనుమానమే. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నియోజకవర్గాలకు ఇన్ చార్జ్ లను ప్రకటించి కొంతమందికి షాకిచ్చారు. మిగతా చోట్ల ఎమ్మెల్యేల పనితీరు గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు జగన్ వ్యూహం ఏంటో.. మూడో సమీక్షలో తేలిపోతుందనే అంచనాలున్నాయి.