వైసీపీ అభ్యర్థులకు సీఎం జగన్ కీలక సూచన..

అభ్యర్థులకు పలు కీలక సూచనలు చేశారు సీఎం జగన్. రీజనల్ కోఆర్డినేటర్ల ద్వారా తన సూచనలు అభ్యర్థులకు చేరవేశారు.

Advertisement
Update:2024-03-18 20:57 IST

ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత సీఎం జగన్ తొలిసారిగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ మీటింగ్ జరిగింది. జగన్ బస్సుయాత్ర ప్రకటన కూడా ఇక్కడే వెలువడింది. పార్టీ అభ్యర్థుల ప్రచార కార్యక్రమాలు, మేనిఫెస్టో తదితర అంశాలపై కూడా చర్చ జరిగింది. ఈ సందర్భంగా అభ్యర్థులకు పలు కీలక సూచనలు చేశారు సీఎం జగన్. రీజనల్ కోఆర్డినేటర్ల ద్వారా తన సూచనలు అభ్యర్థులకు చేరవేశారు.

అంతా మన మంచికే..

సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఏపీలో అభ్యర్థులకు కాస్త ఎక్కువ సమయం లభించిందన్నారు సీఎం జగన్. ఈ సమయాన్ని వైసీపీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తమ పరిధిలోని ప్రతి గ్రామ, వార్డు సచివాలయాన్ని అభ్యర్థులు సందర్శించాలని చెప్పారు. ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని, నిత్యం ప్రజల్లోనే ఉండాలన్నారు. సిద్ధం సభలను విజయవంతం చేసినట్టే.. బస్సు యాత్రని కూడా విజయవంతం చెయ్యాలన్నారు. కూటమిని సమర్థంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

బస్సు యాత్ర అందుకోసమే..

2019 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్ చేపట్టిన పాదయాత్ర ఏ స్థాయిలో విజయవంతమైందో అందరికీ తెలుసు. ప్రజలను కలసుకోవడంతోపాటు, అభ్యర్థుల శక్తి సామర్థ్యాలను అంచనా వేయడం, వారికి తగిన సూచనలు చేయడం, స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకోడానికి ఆ యాత్ర బాగా పనికొచ్చింది. ‘మేమంతా సిద్ధం’ అనే పేరుతో తాజాగా జగన్ చేపడుతున్న బస్సుయాత్ర ప్రధాన ఉద్దేశం కూడా అదేనని తెలుస్తోంది. సిద్ధం సభలతో ఇప్పటికే నాలుగు ప్రాంతాల ప్రజల మధ్యకు వెళ్లారు జగన్. బస్సు యాత్ర ద్వారా అభ్యర్థులతో ముఖాముఖి చర్చలకు ఆయనకు మరింత సమయం దొరుకుతుంది. స్థానిక పరిస్థితులపై పూర్తి స్థాయిలో అవగాహన వస్తుంది. ప్రచారం, హామీల విషయంలో అభ్యర్థులకు ఆయన మరిన్ని సూచనలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే జగన్ ఈ యాత్రకు ముందే మేనిఫెస్టో ప్రకటిస్తారా, లేక యాత్ర తర్వాత ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మేనిఫెస్టోలో జోడిస్తారా అనేది తేలాల్సి ఉంది. 

Tags:    
Advertisement

Similar News