జగన్ వస్తే పథకాల కొనసాగింపు.. బాబు వస్తే పథకాలకు ముగింపు
మరో 10, 15 ఏళ్లు ఇలాంటి పాలనే ఉంటే ప్రజల జీవితాల్లో గణనీయ మార్పు వస్తుందన్నారు. చంద్రబాబు మాయలో పడొద్దని, మన భవిష్యత్ కోసం వైసీపీకి ఓటు వేయాలన్నారు జగన్.
మేనిఫెస్టో ప్రకటన తర్వాత సీఎం జగన్ తొలిసారిగా బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈపాటికే ఆయనకు మేనిఫెస్టోపై ఫీడ్ బ్యాక్ అంది ఉంటుంది. ఆ ఫీడ్ బ్యాక్ తో ఆయన తన ప్రసంగాన్ని మరింత పదునెక్కించారు. పొరపాటున కూడా చంద్రబాబు ఉచ్చులో పడొద్దని ప్రజలకు సూచించారు జగన్. చంద్రబాబుని నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టినట్టేనని, టీడీపీకి ఓటు వేయడమంటే చంద్రముఖిని నిద్రలేపినట్టేనని చెప్పారు. జగన్‌కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. పథకాలకు ముగింపేనని అన్నారు. తాడిపత్రి సభలో బాబుపై మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు జగన్.
2019లో ఇచ్చిన మేనిఫెస్టోని 99 శాతం అమలు చేశామని చెప్పిన సీఎం జగన్.. అలవికాని, అమలు సాధ్యం కాని హామీలను తాను ఇవ్వలేదన్నారు. ఐదేళ్లలో బటన్ నొక్కి రూ. 2.7 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో వేశామన్నారు. లంచాలు లేకుండా, వివక్ష లేని పాలనను అందించామన్నారు. 2.3 లక్షల ఉద్యోగాలిచ్చామన్నారు. వచ్చే ఐదేళ్ల భవిష్యత్ ని నిర్ణయించే ఎన్నికలు ఇవని, ప్రజలు జాగ్రత్తగా ఓటు వేయాలన్నారు జగన్.
ఐదేళ్లలో ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థతో పాలన ప్రజల వద్దకు చేరిందని, పెన్షన్లు నేరుగా ఇంటి వద్దకే వస్తున్నాయని, రేషన్ బండి ఇంటి వద్దకే వచ్చి సరకులు ఇస్తోందని, ఇంటి వద్దకే వైద్య సేవలు వచ్చాయని.. ఇవన్నీ మళ్లీ ఇలాగే కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి రావాలన్నారు జగన్. మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వమే వస్తే మీ జీవితాలు ఎంతగా బాగుపడతాయో ఊహించండి అని చెప్పారు. మరో 10, 15 ఏళ్లు ఇలాంటి పాలనే ఉంటే ప్రజల జీవితాల్లో గణనీయ మార్పు వస్తుందన్నారు. చంద్రబాబు మాయలో పడొద్దని, మన భవిష్యత్ కోసం వైసీపీకి ఓటు వేయాలన్నారు జగన్.