చేయలేనివి చెప్పకూడదు.. మాట ఇస్తే తప్పకూడదు

మరోసారి విశాఖ రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్ ను రాష్ట్ర విభజనలో కోల్పోయామని, ఇప్పటికీ మనల్ని రెవెన్యూ లోటు వెంటాడుతోందని, అందుకోసమే విశాఖ గురించి పదేపదే చెబుతున్నానన్నారు.

Advertisement
Update:2024-02-06 20:11 IST

ఎన్నికల ఏడాదిలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలుపుతూ సీఎం జగన్ తన సుదీర్ఘ ప్రసంగంలో ప్రభుత్వ విజయాలను వివరించారు. గత 57 నెలల్లో జరిగిన మంచి ఇదీ అంటూ వివరించారు. చేయలేనివి చెప్పకూడదని, మాట ఇస్తే తప్పకూడదని, విశ్వసనీయతకు అర్ధం జగనేనని చెప్పారాయన. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను అమలు చేశామని, మేలు చేశాం కాబట్టే ప్రతి గడపకు ధైర్యంగా పోగలుగుతున్నామని వివరించారు జగన్.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 5 బడ్జెట్ లు ప్రవేశపెట్టామని, ఇప్పుడు ప్రవేశ పెడుతున్న బడ్జెట్ కు మరిన్ని మెరుగులద్ది.. వచ్చే ప్రభుత్వంలో అమలు చేసుకుందామని ధీమావ్యక్తం చేశారు జగన్. 2024 జూన్ లో మన ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. కరోనా కారణంగా ఆదాయం తగ్గిందని, అదే సమయంలో ఖర్చులు పెరిగాయని ఆ మూడేళ్లలో రాష్ట్రం రూ.66,116 కోట్లు నష్టపోయిందని వివరించారు జగన్. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గిపోయాయని, అయినా కూడా ఎన్నో కష్టనష్టాలకోర్చి పథకాలు ఆగకుండా పాలన కొనసాగించామన్నారు.

విశాఖ ఎందుకంటే..?

మరోసారి విశాఖ రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్ ను రాష్ట్ర విభజనలో కోల్పోయామని, ఇప్పటికీ మనల్ని రెవెన్యూ లోటు వెంటాడుతోందని, అందుకోసమే విశాఖ గురించి పదేపదే చెబుతున్నానన్నారు. విశాఖ రాజధానిగా పెట్టుబడులు వస్తే రాష్ట్రం బలపడుతుందని చెప్పారు. కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రావొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు జగన్. పరోక్షంగా ప్రత్యేక హోదా అంశాన్ని గుర్తు చేశారు.

చంద్రబాబుపై ధ్వజం..

14ఏళ్ల చంద్రబాబు హయాంలో ఒక్కరికీ మంచి జరగలేదని, మళ్లీ ఏ మొహం పెట్టుకుని ఆయన ప్రజల వద్దకు ఓట్లు అడగడానికి వస్తున్నారని ప్రశ్నించారు సీఎం జగన్. గత మేనిఫెస్టోని మాయం చేసిన ఆయనకు, కొత్త మేనిఫెస్టో ప్రకటించే అర్హత లేదన్నారు. పక్క రాష్ట్రం పథకాలను కాపీకొట్టి తన మేనిఫెస్టోలో పెట్టుకుంటున్నారని, మరోసారి మోసం చేయడానికి ఆయన రెడీ అవుతున్నారని ఎద్దేవా చేశారు. డీబీటీ పథకాలతో రాష్ట్రం శ్రీలంకలా తయారైందంటూ ఎల్లో మీడియా అసత్య ప్రచారాలు చేస్తోందని, మరి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇవే పథకాలు ఎలా అమలు చేస్తారని నిలదీశారు. చంద్రబాబుకి ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని, అందుకే పొత్తులకోసం వెంపర్లాడుతున్నారని మండిపడ్డారు జగన్. 

Tags:    
Advertisement

Similar News