బాబుని నమ్మారంటే.. పులినోట్లో తల పెట్టినట్టే
తన గతం చెప్పి ఓటు అడిగే దమ్ము, ధైర్యం చంద్రబాబుకి ఉందా అని ప్రశ్నించారు సీఎం జగన్. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తురాదన్నారు.
కావలిలో జరిగిన 'మేమంతా సిద్ధం' సభలో మరోసారి చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడ్డారు సీఎం జగన్. అబద్ధాలు, మోసం, కుట్ర.. అన్నీ కలిపితే చంద్రబాబు అని అర్థం చెప్పారు. మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతుందని, పెత్తందార్ల పక్షాన చంద్రబాబు ఉంటే, పేదల పక్షాన మీ బిడ్డ జగన్ ఉన్నాడని తెలిపారు. మీ బిడ్డ హయాంలో ప్రతి ఇంటికి మంచి జరిగిందని, జరిగిన మంచి కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా..? అని ప్రశ్నించారు.
ఆ ధైర్యం ఉందా బాబూ..?
తన గతం చెప్పి ఓటు అడిగే దమ్ము, ధైర్యం చంద్రబాబుకి ఉందా అని ప్రశ్నించారు సీఎం జగన్. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తురాదన్నారు. మేనిఫెస్టో కాపీలు చూపించే దమ్ము, దైర్యం చంద్రబాబుకు లేవన్నారు. 30 ఏళ్ల క్రితమే సీఎంగా చేసిన చంద్రబాబు, తన గతాన్ని చూసి ఓటేయండి అని ఎప్పటికీ అడగలేరని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు అభివృద్ధి చేస్తే పొత్తులెందుకు..?
ఒకవేళ తన హయాంలో చంద్రబాబు అభివృద్ధి పనులు చేసి ఉంటే.. ఇప్పుడీ పొత్తులెందుకని ప్రశ్నించారు సీఎం జగన్. ఎన్నికలొస్తే చాలు ప్రజలను మభ్యపెట్టేందుకు బాబు ముందుకొస్తాడన్నారు. ఒక్కసారి తనను ఆశీర్వదించినందుకే 58 నెలల పాటు సంక్షేమం అందించానని, 99 శాతం హామీలు నెరవేర్చానని.. ఇప్పుడు మళ్లీ మీ ఆశీస్సులు కోరుతున్నాని చెప్పారు జగన్. మరో ఐదేళ్ల పాటు మంచి కొనసాగాలంటే మీరు తోడుగా ఉండాలని అన్నారు. ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. సూపర్ సిక్స్, సెవెన్ అంటూ చంద్రబాబు చెప్పే మాటల్ని నమ్మొద్దని అన్నారు జగన్.