జగన్ కు భారీ భద్రత.. యాత్రలో కట్టుదిట్టమైన ఆంక్షలు
ఇదివరకటిలాగా గజమాలలతో స్వాగతాలు అంత జోరుగా కనపడకపోవచ్చు. గజమాలలు, జగన్ పైపూలు విసరడంపై కూడా ఆంక్షలు విధించామంటున్నారు పోలీసులు.
సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' బస్సుయాత్ర మళ్లీ మొదలైంది. దాడి ఘటన తర్వాత ఆయన భద్రత విషయంలో పోలీసులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైసీపీ ఫిర్యాదుతో ఈసీ కూడా పోలీస్ డిపార్ట్ మెంట్ కు ప్రత్యేక సూచనలు చేసింది. దీంతో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. బస్సు యాత్ర మార్గాల్లో DSPలతో భద్రత కల్పిస్తున్నారు. సీఎం వెళ్లే మార్గాన్ని సెక్టార్లుగా విభజించి.. ఒక్కో సెక్టారు వద్ద ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలకు భద్రత బాధ్యత అప్పగించారు. నిర్దేశించిన ప్రాంతాల్లోనే సీఎం రోడ్ షో లు, సభలు ఉంటాయి.
ఇదివరకటిలాగా గజమాలలతో స్వాగతాలు అంత జోరుగా కనపడకపోవచ్చు. గజమాలలు, జగన్ పైపూలు విసరడంపై కూడా ఆంక్షలు విధించామంటున్నారు పోలీసులు. అయితే జగన్ వద్దకు నేరుగా వచ్చి కలిసే వారిపై మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవు. ఈరోజు కూడా జగన్ బస్సుయాత్ర బయలుదేరిన తర్వాత పలువురు ప్రజలు ఆయన్ను కలిశారు. బస్సు వద్దకు వచ్చి ఆయనతో మాట్లారు, తమ కష్టసుఖాలు చెప్పుకున్నారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కొంతమంది వృద్ధులు జగన్ ని చూసి కన్నీరు పెట్టుకున్నారు.
ఇక యాత్ర ప్రారంభానికి ముందు పలువురు వైసీపీ నేతలు ఆయన్ను పరామర్శించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలినేని శ్రీనివాసులరెడ్డి, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, ఇతర నేతలు సీఎం జగన్ ని కలిశారు. జగన్ మాత్రం హుషారుగా కనిపించారు. గాయం తగిలిన ప్రాంతంలో వైట్ బ్యాండ్ ఎయిడ్ ఉంది.