వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుద‌ల‌.. - 2,011 మందికి రూ.కోటీ 55 వేలు జ‌మ‌

జూనియ‌ర్ న్యాయ‌వాదులు వృత్తిలో ఎదుర‌య్యే ఆర్థిక ఇబ్బందుల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డేందుకు వీలుగా అర్హులైన ప్ర‌తి జూనియ‌ర్ న్యాయ‌వాదికీ రూ.5 వేలు చొప్పున మూడేళ్ల పాటు ప్ర‌భుత్వం ఆర్థిక సాయం అంద‌జేస్తోంది.

Advertisement
Update:2023-02-22 12:25 IST

మూడేళ్లుగా అమ‌లు చేస్తున్న వైఎస్సార్ లా నేస్తం ప‌థ‌కంలో భాగంగా ఈ ఏడాది కూడా రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నిధులు విడుద‌ల చేశారు. బుధ‌వారం తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యం నుంచి బ‌ట‌న్ నొక్కి ల‌బ్ధిదారుల ఖాతాల్లోకి సొమ్ము జ‌మ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,011 మంది జూనియ‌ర్ లాయ‌ర్లు ఈ ప‌థ‌కం కింద అర్హులుగా గుర్తించారు. వారి ఖాతాల్లో మొత్తం రూ.కోటీ 55 వేల న‌గ‌దును జ‌మ చేశారు.

పాద‌యాత్ర‌లో ఇచ్చిన హామీలో భాగంగా సీఎం వైఎస్ జ‌గ‌న్ జూనియ‌ర్ న్యాయ‌వాదుల‌ను ఆదుకునేందుకు ఈ ప‌థ‌కాన్ని అమ‌లులోకి తెచ్చిన విష‌యం తెలిసిందే. లా నేస్తం ద్వారా కొత్త‌గా న్యాయ‌వాద వృత్తిలోకి వ‌చ్చిన జూనియ‌ర్ న్యాయ‌వాదులు వృత్తిలో ఎదుర‌య్యే ఆర్థిక ఇబ్బందుల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డేందుకు వీలుగా అర్హులైన ప్ర‌తి జూనియ‌ర్ న్యాయ‌వాదికీ రూ.5 వేలు చొప్పున మూడేళ్ల పాటు ప్ర‌భుత్వం ఆర్థిక సాయం అంద‌జేస్తోంది. బుధ‌వారం అందిస్తున్న మొత్తంతో క‌లిపి మొత్తం 4,248 మంది న్యాయ‌వాదుల‌కు మూడున్న‌రేళ్ల కాలంలో అంద‌జేసిన మొత్తం ఆర్థిక సాయం రూ.35.40 కోట్లు కావ‌డం గ‌మ‌నార్హం.

అలాగే న్యాయ‌వాదుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం రూ.100 కోట్ల కార్ప‌స్ ఫండ్ ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ఇందుకోసం న్యాయ‌, ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శులు స‌భ్యులుగా ఒక ట్ర‌స్టును కూడా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. కోవిడ్ స‌మ‌యంలో న్యాయ‌వాదుల‌ను ఆదుకునేందుకు ఈ కార్ప‌స్ ఫండ్ నుంచి రూ.25 కోట్లు జ‌గ‌న్ ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. అర్హులైన న్యాయ‌వాదుల‌కు రుణం, బీమా, ఇత‌ర వైద్య అవ‌స‌రాల నిమిత్తం ఈ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అంద‌జేస్తారు.

Tags:    
Advertisement

Similar News