మీ సలహాలు వినేందుకు సిద్ధం.. ముఖాముఖిలో సీఎం జగన్
వైసీపీ పాలనలో ఎక్కడా లంచాలు లేవని, ఎక్కడా వివక్షకు తావులేదని, అర్హత ఉంటే చాలు పథకాలు అందజేస్తున్నామని చెప్పారు జగన్.
సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజుకి చేరుకుంది. ఆళ్లగడ్డ నైట్ హాల్ట్ పాయింట్ వద్ద సీఎం జగన్‌ను ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నేతలు కలిశారు. ఇక్కడే చేరికల కార్యక్రమం కూడా జరిగింది. టీడీపీతోపాటు ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఎర్రగుంట్ల గ్రామంలో ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు జగన్.
నేను సిద్ధం..
వ్యవస్థలో సామర్థ్యం పెంచేందుకు తనకు సలహాలివ్వాలని ప్రజలను కోరారు సీఎం జగన్. మీరు సలహాలు ఇస్తే వినడానికి సిద్ధంగా ఉన్నానని వారితో చెప్పారు. మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్ కోసం వేస్తున్నామనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు జగన్. వైసీపీ 58 నెలల పాలనలోనే మార్పు జరిగిందని, ఆ మార్పు కొనసాగాలని, అలా కొనసాగాలంటే మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాలని చెప్పుకొచ్చారు జగన్. ఇంటికి వెళ్లి ఆలోచించి భార్య, పిల్లలతో మాట్లాడి ఓటుపై నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.
వైసీపీ పాలనలో ఎక్కడా లంచాలు లేవని, ఎక్కడా వివక్షకు తావులేదని, అర్హత ఉంటే చాలు పథకాలు అందజేస్తున్నామని చెప్పారు జగన్. ప్రభుత్వ పథకాలతో ఎర్రగుంట్లలో 93 శాతం మంది లబ్ది పొందారని, ఏ పార్టీ అని చూడకుండా పథకాలు అందిస్తున్నామని చెప్పారాయన. గతంలో ఎప్పుడూ లేనట్టుగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని, రైతుకు రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తున్నామని వివరించారు. ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో కనపడుతోందని, ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటికే వచ్చి వైద్యం అందిస్తున్నామని అన్నారు జగన్.
ముసలాయన పాలన చూశారు కదా..
తన కంటే ముందు చాలా మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారని, తాను వచ్చే ముందు 75 ఏళ్ల ఓ ముసలాయన పరిపాలన చేశారు మీకు గుర్తుందా అని ప్రశ్నించారు జగన్. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తి సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. తాను వయసులో చాలా చిన్నవాడినని.. ఇంత చిన్న వ్యక్తి చేసిన పనులు.. అనుభవం ఉన్న ముసలాయన చేయకపోవడం విడ్డూరం అన్నారు జగన్.