వచ్చే ఎన్నికల్లో పోటీ పెత్తందార్లతోనే- జగన్
చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా, దత్తపుత్రుడు వీరంతా ఏ సామాజికవర్గానికి ప్రతినిధులో ఆలోచించుకోవాలన్నారు. మానవత్వానికి, విశ్వసనీయతకు, నిజాయితీకి వైసీపీ ప్రతీక అని జగన్ చెప్పారు.
వైసీపీ నిర్వహించిన జయహో బీసీ సభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 2024 ఎన్నికల్లో పెత్తందార్లతో వైసీపీ పోటీ పడబోతోందని వ్యాఖ్యానించారు. సభకు వచ్చిన వారిలో 85వేల మంది బీసీ ప్రజాప్రతినిధులే ఉన్నారన్నారు. గ్రామగ్రామానికి వెళ్లి 2024లో కూడా వైసీపీకి ఇంత మించిన గెలుపు ఖాయమని ప్రచారం చేయాలన్నారు. ఆ ఎన్నికల్లో పెత్తందార్లతోనూ, మారీచులతో యుద్ధం చేయకతప్పదని ప్రజలకు గట్టిగా చెప్పాలన్నారు. 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలని కూడా ప్రజలకు చెప్పాలన్నారు. పేదలకు టీడీపీ శత్రువని చెప్పాలన్నారు.
చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా, దత్తపుత్రుడు వీరంతా ఏ సామాజికవర్గానికి ప్రతినిధులో ఆలోచించుకోవాలన్నారు. మానవత్వానికి, విశ్వసనీయతకు, నిజాయితీకి వైసీపీ ప్రతీక అని జగన్ చెప్పారు. చంద్రబాబు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు వివరించాలని బీసీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. గ్రామ సచివాలయాల ద్వారా ఉద్యోగాలు పొందిన వారిలో 84 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారని గుర్తించుకోవాలన్నారు. వలంటీర్లలో 83 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలేనన్నారు.
ప్రతి పథకంలోనూ బీసీలకు పెద్దపీట వేశామన్నారు. తన వయసు 49ఏళ్లు అని అదే చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చే 45ఏళ్లు అవుతోందని.. కానీ ఇప్పటికీ ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని జగన్ ఎద్దేవా చేశారు. బీసీలకు చేసింది ఏమీ లేదు కాబట్టే చంద్రబాబు ఎల్లో మీడియా, దత్తపుత్రుడి మీద ఆధారపడుతున్నారని జగన్ విమర్శించారు. ఇలాంటి చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బీసీలంతా గట్టిగా బుద్ది చెప్పి వైసీపీని మరోసారి గెలిపించాలని జగన్ విజ్ఞప్తి చేశారు.