వాలంటీర్లంటే చంద్రబాబుకి కడుపు మంట..
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారథులే వాలంటీర్లు అని కొనియాడారు సీఎం జగన్. సంక్షేమ పథకాల సారథులు వారేనని చెప్పారు.
వాలంటీర్లంటే చంద్రబాబుకి కడుపుమంట అని అన్నారు సీఎం జగన్. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, ఉత్తమ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలు ప్రదానం చేసి సత్కరించారు.
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారథులే వాలంటీర్లు అని కొనియాడారు సీఎం జగన్. సంక్షేమ పథకాల సారథులు వారేనని చెప్పారు. సూర్యుడు ఉదయించక ముందే ఇంటి తలుపు తట్టి పింఛన్లు అందిస్తున్నారని, ప్రతి నెలా ఒకటో తేదీనే 64 లక్షల మందికి రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లు అందుతున్నాయని అన్నారు. 2.66 లక్షల మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా పేదలకు సేవ చేస్తున్నారని అభినందించారు. కేవలం పింఛన్లే కాదని, అమ్మఒడి, ఆసరా, చేయూత, ఇళ్ల పట్టాలు, రైతు భరోసా వంటి పథకాలను లబ్ధిదారులకు చేరవేయడంలో కూడా వాలంటీర్ల పాత్ర ఎనలేదనిదని అన్నారు. గతంలో జన్మభూమి కమిటీల అరాచకాల వల్ల ప్రజలు నష్టపోయారని వివరించారు.
ఇదీ మా ట్రాక్ రికార్డ్..
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ ఫర్ (డీబీటీ) ద్వారా 2.10 లక్షల కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు సీఎం జగన్. నాన్ డీబీటీ ద్వారా మరో 90వేలకోట్లు అందించామని మొత్తంగా 3లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు చేరాయని అన్నారు. వివక్షకు చోటు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, 25 రకాల పథకాలకు వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లని చెప్పారు. ప్రభుత్వంపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ నిజాలు చెప్పగలిగిన సత్యసారథులు వాలంటీర్లేనన్నారు. ప్రజలకు మంచి చేశాం కాబట్టే గడపగడపకు వెళ్లగలుగుతున్నామని వివరించారు జగన్.