కార్లను మార్చినట్టు భార్యలను మారుస్తాడు
అనకాపల్లి జిల్లా పిసినికాడలో వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులు విడుదల చేసిన సీఎం జగన్.. చంద్రబాబు, పవన్ విశ్వసనీయత లేని వ్యక్తులు అని విమర్శించారు.
పవన్ కల్యాణ్ వివాహాల ఎపిసోడ్ పై మరోసారి స్పందించారు సీఎం జగన్. ఆయన వివాహ వ్యవస్థకే మచ్చ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కార్లను మార్చినట్టు భార్యలను మార్చేస్తాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచనలు గుర్తొస్తాయన్నారు. వారిద్దరూ కలిసి 2014లో అసత్య వాగ్దానాలతో ప్రజల్ని మోసం చేశారని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తామంటూ దగా చేశారని విమర్శించారు. 2014లో ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చని చంద్రబాబు రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెబుతారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అనకాపల్లి జిల్లా పిసినికాడలో వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులు విడుదల చేసిన సీఎం జగన్.. చంద్రబాబు, పవన్ విశ్వసనీయత లేని వ్యక్తులు అని విమర్శించారు.
చంద్రబాబును నమ్మడం అంటే కాటేసే పామును నమ్మడమేనని, మనల్ని మింగేసే పులిని ఇంటికి తెచ్చకోవడమేనని అన్నారు జగన్. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారన్నారు. బీసీలకు చంద్రబాబు చేసింది సున్నా అనిచెప్పారు. చంద్రబాబు పేరు చెబితే మూడుసార్లు సీఎంగా, అక్కచెల్లెమ్మలకు చేసిన మోసాలు, వంచనలు గుర్తొస్తాయని, పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుందని అన్నారు జగన్.
మహిళా దినోత్సవం ముందురోజు అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉందని చెప్పారు సీఎం జగన్. వైసీపీ 58 నెలల పరిపాలనలో అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందుడుగు వేశామన్నారు. వైఎస్సార్ చేయూత కార్యక్రమంతో ప్రతి మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూరిందని వివరించారు. 14 రోజుల పాటు చేయూత నిధుల కార్యక్రమం కొనసాగుతుందన్నారు జగన్. 26,98,931 మందికి రూ.5,060 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా మొత్తం రూ.19,189.60 కోట్లు అక్క చెల్లెమ్మల ఖాతాలో జమ చేశామని అన్నారు. అక్కచెల్లెమ్మల పిల్లలు పెద్ద చదువులు చదివితే వారి తలరాతలు మారతాయన్నారు జగన్.