కుప్పంలో డైరెక్ట్ హిట్, మంగళగిరిలో సైలెంట్ హిట్..

చేనేత వర్గాల నుంచే లోకేష్ కి షాక్ తగిలింది. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసిన గంజి చిరంజీవి ఇప్పడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ముఖ్యంగా 2024లో మంగళగిరిలో విజయం ఆశిస్తున్న లోకేష్ కి ఇది పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి.

Advertisement
Update:2022-08-10 15:12 IST

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గానూ 175చోట్లా వైసీపీ అభ్యర్థులు గెలవాలనేది సీఎం జగన్ టార్గెట్. అందులో టీడీపీ కంచుకోట అని చెప్పుకునే కుప్పం కూడా ఉంది. ఇటీవలే కుప్పం విషయంలో జగన్ తన టార్గెట్ చెప్పి మరీ అడుగులు వేస్తున్నారు. కుప్పం నియోజకవర్గానికి నిధుల వరద పారిస్తున్నారు. తాజాగా మంగళగిరిపై కూడా వైసీపీ ఫోకస్ పెంచింది. కానీ ఆ విషయం అక్కడ టీడీపీ కీలక నేత రాజీనామా చేసే వరకు బయటపడలేదు. సైలెంట్ గా మంగళగిరిలో టీడీపీని బలహీనపరుస్తూ లోకేష్ కి షాకిస్తోంది వైసీపీ.

లోకేష్ కి ఎదురుదెబ్బ..

2019 ఎన్నికల్లో లోకేష్ రాజధాని ప్రాంతంలో ఉన్న మంగళగిరిని సేఫెస్ట్ ప్లేస్ గా ఎంచుకొని పోటీ చేశారు. కానీ కథ అడ్డం తిరిగింది. మంగళగిరీలో వైసీపీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి లోకేష్ కి షాకిచ్చారు. మంత్రి పదవిలో ఉండి కూడా అక్కడ లోకేష్ ఓటమి చవిచూశారు. 2024లో అదే నియోజకవర్గం నుంచి గెలవాలనేది ఆయన ఆలోచన. ఇప్పటినుంచే అక్కడ ఇంటింటికీ ప్రచారం చేపట్టారు, స్థానికంగా అన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నారు. తన పేరుమీద ప్రతి గ్రామంలో తోపుడు బండ్లు పంచి పెడుతున్నారు. ముఖ్యంగా చేనేతల ఓట్లకోసం కష్టపడుతున్నారు. ఈ దశలో చేనేత వర్గాల నుంచే లోకేష్ కి షాక్ తగిలింది. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసిన గంజి చిరంజీవి ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. 2019లో ఆయన్ను కాదని లోకేష్ కి టికెట్ ఇచ్చినా ప్రచారం చేశారు. 2024లో టికెట్ ఇవ్వరని తెలిసినా కూడా పార్టీలోనే ఉన్నారు. కానీ, ఇటీవ‌ల పార్టీ వ్యవహారాలతో ఆయన విసిగిపోయారు. టీడీపీకి రాజీనామా చేశారు. కేవలం మంగళగిరిలోనే కాదు, గుంటూరు జిల్లాలో కూడా టీడీపీకి ఇది నష్టం కలిగించే పరిణామం అని తెలుస్తోంది. ముఖ్యంగా 2024లో మంగళగిరిలో విజయం ఆశిస్తున్న లోకేష్ కి ఇది పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి.

కుప్పంలో అలా..

ఇక్కడ మంగళగిరిలో లోకేష్ కి ముచ్చెమటలు పడుతున్నట్టే, అక్కడ కుప్పంలో చంద్రబాబు కూడా వణికిపోతున్నారు. దశాబ్దాలుగా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంపై తన పట్టు తగ్గిపోతోందని భయపడుతున్నారు. ఆ భయానికి ప్రధాన కారణం జగన్ అయితే, మరో కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జగన్ డైరెక్షన్లో, పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో అక్కడ వైసీపీ ఇన్ చార్జ్ భరత్ పార్టీని బలపరుస్తున్నారు. తాజాగా కుప్పం నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశమైన జగన్, కుప్పాన్ని తన సొంత నియోజకవర్గంగా భావిస్తానని అన్నారు. అన్నట్టుగానే ఆ మీటింగ్ జరిగిన రెండు వారాల్లోపు కుప్పంకు 66కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు విడుదల చేశారు. కుప్పం మున్సిపాల్టీ పరిధిలోని 25వార్డుల్లో 67కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు అందాయి. దానిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం 66 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కుప్పంలో జరగని అభివృద్ధిని ఇప్పుడు చేసి చూపిస్తామంటున్నారు వైసీపీ నేతలు. అదే సాధ్యమైతే.. చంద్రబాబుకి వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగడానికి కూడా సరైన కారణం దొరకదు. తండ్రి, తనయుడు.. అనుకూలమైన నియోజకవర్గాల కోసం వెదుకులాట మొదలు పెట్టాల్సిందే.

Tags:    
Advertisement

Similar News