రాక్ష‌స బుద్ధి గ‌ల‌వారితో యుద్ధం చేస్తున్నాం.. విప‌క్షాల‌పై మ‌రోసారి జ‌గ‌న్ ఫైర్‌

పేద‌వాడికి ఇల్లు రాకూడ‌ద‌ని అడ్డుకోవ‌డం కోసం సుప్రీంకోర్టు వ‌ర‌కూ వెళ్లి మ‌రీ ప్ర‌య‌త్నించార‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. ఇందులో భాగంగా 18 కేసులు వేశార‌ని తెలిపారు.

Advertisement
Update:2023-07-24 15:23 IST

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విప‌క్షాల‌పై మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈసారి వేదిక గుంటూరు జిల్లా అమ‌రావ‌తి ప్రాంతం. తొలుత సోమ‌వారం ఉదయం కృష్ణాయ‌పాలెంలో పేద‌ల‌ ఇళ్ల నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన జ‌గ‌న్.. ప‌ట్టాలు కూడా అంద‌జేశారు. అనంత‌రం వెంక‌ట‌పాలెంలో జ‌రిగిన స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు.

పేద‌వాడికి ఇల్లు రాకూడ‌ద‌ని చంద్ర‌బాబు, ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, టీవీ-5, ద‌త్త‌పుత్రుడుతో పాటు చంద్ర‌బాబు పుట్టించిన ఊరూపేరూ లేని సంఘాలు అడ్డుప‌డ్డాయ‌ని మండిప‌డ్డారు. పేద‌ల‌కు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా.. ఇళ్లు కట్టించి ఇవ్వకుండా అడ్డుతగిలిన ప్రబుద్ధులు వీర‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పేదవాడికి ఇల్లు రాకూడదని ఎన్నో ప్రయత్నాలు చేశారని, ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలోనే చూశామ‌ని చెప్పారు. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయ పార్టీలను ఎక్కడా చూడలేదని ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆవేదన వ్యక్తం చేశారు. రాక్షస బుద్ధి గ‌ల‌వారితో మనం యుద్ధం చేస్తున్నామ‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు.

ఇళ్లు కట్టిస్తానని గతంలో చంద్రబాబు మోసం చేశారని, ఇప్పుడు పేద‌వాడికి ఇల్లు రాకూడ‌ద‌ని అడ్డుకోవ‌డం కోసం సుప్రీంకోర్టు వ‌ర‌కూ వెళ్లి మ‌రీ ప్ర‌య‌త్నించార‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. ఇందులో భాగంగా 18 కేసులు వేశార‌ని తెలిపారు. వీరిపై త‌మ ప్ర‌భుత్వం పేద‌ల త‌ర‌ఫున మూడేళ్ల‌పాటు పోరాటం చేసి సాధించిన విజ‌యం ఇద‌ని ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ చెప్పారు.

ఇక సామాజిక అమరావతి..

పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తే రాజధాని అభివృద్ధి చెందదని కొందరు వాదించారని, పేద‌లు ఇక్క‌డ ఉండ‌కూడ‌దా అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ఇప్పుడు పేదలకు అండగా మార్పు మొదలైంది. అమరావతిని సామాజిక అమరావతిగా పునాది రాయి వేస్తున్నాన‌ని చెప్పారు. ఇక నుంచి అమరావతి మనందరిది అని ప్ర‌జ‌లనుద్దేశించి తెలిపారు. మహిళా సాధికారతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని, అక్కచెల్లెమ్మల పేరిటే ఇళ్ల స్థలాలు ఇచ్చామ‌ని ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. సీఆర్‌డీఏ ప‌రిధిలో పేద‌ల ఇళ్ల నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టిన జ‌గ‌న్‌.. రూ.1,829. 57 కోట్ల వ్యయంతో.. 50,793 వేల మంది పేదలకు స్థిర నివాసాలు ఏర్పాటు చేయనున్నారు.

Tags:    
Advertisement

Similar News