2,677 మంది ఖాతాల్లో 'లా నేస్తం' నిధులు జమ
న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా నిలిచిందని, అదే క్రమంలో ప్రభుత్వం తరఫు నుంచి న్యాయవాదులను కోరేది ఒక్కటేనని ఈ సందర్భంగా జగన్ చెప్పారు.
వైఎస్ఆర్ లా నేస్తం పథకం కింద 2023–24 సంవత్సరం మొదట విడత నిధులను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5 వేల స్టైఫండ్ చొప్పున వీటిని జమ చేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి రూ.6.12 కోట్ల నగదును సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్ లా నేస్తం పథకం, ఇలాంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో లేదని, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే జరుగుతోందని చెప్పారు. అడ్వకేట్లకు అన్నిరకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో ఇప్పటికే వెల్ఫేర్ ట్రస్టును ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. ఈ ట్రస్ట్ ద్వారా మెడిక్లెయిమ్ కానీ, ఇతరత్రా అవసరాలకు రుణాలు గానీ.. ఈ ఫండ్ నుంచి రూ.25 కోట్లు సహాయం చేసినట్టు వివరించారు.
న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా నిలిచిందని, అదే క్రమంలో ప్రభుత్వం తరఫు నుంచి న్యాయవాదులను కోరేది ఒక్కటేనని ఈ సందర్భంగా జగన్ చెప్పారు. జూనియర్లుగా ఉన్న న్యాయవాదులు ప్రతి ఒక్కరూ దీనివల్ల మంచి జరిగితే.. వీరు స్థిరపడ్డాక ఇదే మమకారం పేదలపట్ల చూపించాలని కోరారు. ఒక అన్నగా, ఒక స్నేహితుడిగా వారి దగ్గరనుంచి ఇదే ఆశిస్తున్నానని, దీన్ని ఎప్పుడూ మరిచిపోవద్దని సీఎం జగన్ కోరారు.