తగ్గేదే లేదంటన్న జగన్.. మళ్లీ యాత్ర షురూ
రోజుకి మూడు నియోజకవర్గాల చొప్పున మొదటి 4 రోజులకు సంబంధించిన టూర్ షెడ్యూల్ ని వైసీపీ అధికారికంగా ప్రకటించింది.
సిద్ధం సభల తర్వాత వెంటనే మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర చేపట్టారు సీఎం జగన్. అది కూడా విజయవంతంగా పూర్తయింది. ఈరోజు పులివెందులలో నామినేషన్ వేశారు. వెంటనే మరో యాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. ఎన్నికల వరకు ప్రజల్లో ఉండే విధంగా మరో టూర్ ప్లాన్ చేశారు. ఈనెల 28నుంచి జగన్ అసెంబ్లీ నియోజకవర్గాల పర్యటన మొదలవుతుంది.
రోజుకి మూడు నియోజకవర్గాల చొప్పున మొదటి 4 రోజులకు సంబంధించిన టూర్ షెడ్యూల్ ని వైసీపీ అధికారికంగా ప్రకటించింది.
ఈనెల 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు
29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరు
30న కొండెపి, మైదుకూరు, పీలేరు
మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు సీఎం జగన్. నేరుగా ఆయా నియోజకవర్గాలకు వెళ్లి అక్కడ సభల్లో ప్రసంగిస్తారు. వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు.
ఇటీవల మేమంతా సిద్ధం పేరుతో 22 రోజుల్లో 23 జిల్లాల్లో పర్యటించారు సీఎం జగన్. 86 నియోజకవర్గాలు కవర్ చేశారు. 2,188 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో 9 భారీ రోడ్ షోలు 6 ప్రత్యేక సమావేశాలు 16 బహిరంగ సభలు జరిగాయి. ఇప్పుడు మిగతా నియోజకవర్గాలను కూడా కవర్ చేసేందుకు జగన్ బయలుదేరారు. వైనాట్ 175 అంటూ కాన్ఫిడెంట్ గా బరిలో దిగుతున్న సీఎం జగన్.. ప్రచార పర్వంలో కూడా ఎక్కడా తగ్గేది లేదంటున్నారు. ప్రతి నియోజకవర్గాన్నీ టచ్ చేసేందుకు ఆయన వ్యూహ రచన చేశారు. ఎన్నికలకు మిగిలున్న కాస్త టైమ్ ని సద్వినియోగం చేసుకోబోతున్నారు.