ముగిసిన జగన్ బస్సు యాత్ర.. హైలైట్స్ ఇవే..
బాబులాంటి మోసగాడు కావాలా?.. జగన్ లాంటి నిజాయతీపరుడు కావాలా? తేల్చుకోవాలన్నారు సీఎం జగన్. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తుకురాదన్నారు.
సీఎం జగన్ "మేమంతా సిద్ధం" బస్సు యాత్ర బుధవారంతో ముగిసింది. 22 రోజులు పాటు 2,100 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. ఇడుపులపాయలో ప్రారంభమైన బస్సుయాత్ర 86 నియోజకవర్గాల మీదుగా సాగింది. ఈ యాత్రలో 16 బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. 6 ప్రత్యేక సమావేశాలకు హాజరయ్యారు. 9 చోట్ల భారీ రోడ్ షోలు నిర్వహించారు.
టెక్కలి సభలో పంచులే పంచులు..
బాబులాంటి మోసగాడు కావాలా?.. జగన్ లాంటి నిజాయతీపరుడు కావాలా? తేల్చుకోవాలన్నారు సీఎం జగన్. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తుకురాదన్నారు. 2014లో ఇదే కూటమి చేసిన మోసాలు గుర్తున్నాయా? అని ప్రశ్నించారు జగన్. మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తోందన్నారు. ఇప్పుడు సూపర్ 6 అంటూ చంద్రబాబు వస్తున్నాడు. ఇంటికి బంగారం, బెంజ్ కారు అంటున్నాడు.. నమ్ముతారా? అని ప్రశ్నించారు జగన్.
జగన్ బస్సు యాత్ర హైలైట్స్:
- అడుగడుగునా జననీరాజనం, దారిపొడవునా జై జగన్ నినాదాలు.
- మహిళలు హారతులు, ఎండను సైతం లెక్క చేయకుండా తరలివచ్చిన జనం.
- కడప, కర్నూలు జిల్లాల్లో వెయ్యి ఎడ్ల బండ్లతో రైతుల స్వాగతం.
- జనసేనకు చెందిన పలువురు ఇన్‌ఛార్జులు, కీలక నేతలు జగన్ సమక్షంలో చేరిక.
- విశాఖ, విజయవాడలో జగన్ మాస్కులు ధరించి విద్యార్థుల సందడి.
- కర్నూలులో జగన్ పర్యటిస్తుండగా జగన్ పైకి చెప్పు విసిరిన ఆగంతకుడు.
- విజయవాడలో జగన్‌పై రాయి దాడితో కలకలం.
ఇలా ఒకటి, రెండు అవాంతరాలు మినహా జగన్ బస్సు యాత్ర సూపర్ సక్సెస్ అయ్యిందని వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
జగన్ నామినేషన్..
గురువారం పులివెందులలో ఉదయం 11గంటలకు నామినేషన్ వేయనున్నారు సీఎం జగన్. అంతకుముందు వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఎన్నికలకు మరో 20 రోజుల సమయం ఉండడంతో.. మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించాలని వైసీపీ చూస్తోంది. ఈనెల 26 లేదా 27 నుంచి బహిరంగ సభలు ఉంటాయని సమాచారం.