బాలినేని అలక.. జగన్ ఎలా తీర్చారంటే..?

జగన్ పిలుస్తున్నారనే మాటతో బాలినేని సభ వద్దకు వచ్చారు. కానీ అక్కడ కూడా అసంతృప్తిగా, అంటీముట్టనట్టుగా కనిపించారు. అయితే అంతలోనే జగన్ చొరవ తీసుకుని బాలినేనిని కూల్ చేశారు.

Advertisement
Update:2023-04-12 19:17 IST

సీఎం జగన్ ట్రెండ్ మార్చినట్టు స్పష్టమవుతోంది. పార్టీలో ఎవరైనా అలిగినా, అసంతృప్తితో ఉన్నా పిలిచి బుజ్జగించే రకం కాదు జగన్. నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసినా, ఓ ఎంపీని దూరం పెట్టినా.. ఎక్కడా ఎవరికీ ఛాన్స్ ఇవ్వలేదు. అయితే ఇటీవల జగన్ వ్యవహార శైలి మారినట్టు కనపడుతోంది. ఇటీవల గడప గడప రివ్యూలో ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకుంటారని అంతా అనుకున్న సందర్భంలో ఆయన ఎవరినీ పల్లెత్తు మాట అనలేదు. ఏ ఒక్క ఎమ్మెల్యేని కానీ, కార్యకర్తను కానీ చేజార్చుకోవడం తనకు ఇష్టం లేదని స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలో ఈరోజు మార్కాపురంలో జరిగిన సభ వ్యవహారం కూడా జగన్ లో మార్పుని స్పష్టంగా బయటపెట్టింది.

అలిగిన బాలినేని..

ఈబీసీ నేస్తం నిధుల విడుదలకోసం సీఎం జగన్ ఈరోజు మార్కాపురం వచ్చారు. కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన వేదికపై వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అయితే అక్కడ బాలినేని శ్రీనివాసులరెడ్డి కనపడలేదు. సీఎం జగన్ హెలిప్యాడ్ వద్దకు వచ్చే క్రమంలో పోలీసులు బాలినేని కారుని దూరంగా ఆపేయడంతో అలిగిన ఆయన తిరిగి వెనక్కు వెళ్లిపోయారు. ఈ విషయం మీడియాలో హైలెట్ కావడంతో పాటు వెంటనే ఎవరో సీఎం జగన్ కి ఉప్పందించారు. దీంతో జగన్, బాలినేని కోసం వాకబు చేశారు. ఆయన్ను వెంటనే సభా వేదిక వద్దకు తీసుకు రావాలని ఆదేశించారు. జగన్ పిలుస్తున్నారనే మాటతో బాలినేని సభ వద్దకు వచ్చారు. కానీ అక్కడ కూడా అసంతృప్తిగా, అంటీముట్టనట్టుగా కనిపించారు. అయితే అంతలోనే జగన్ చొరవ తీసుకుని బాలినేనిని కూల్ చేశారు.

బటన్ నొక్కిన బాలినేని..

ఈబీసీ నేస్తం నిధుల విడుదలకోసం అధికారులు ల్యాప్ టాప్ తీసుకు రాగా.. సీఎం జగన్ బాలినేనితో బటన్ నొక్కించారు. అక్కడితో ఆయన కూల్ అయ్యారు. అలకల విషయంలో జగన్ ఎప్పుడూ ఇంత సున్నితంగా ప్రవర్తించలేదు. బాలినేనికి మంత్రి పదవి దూరమైన సందర్భంలో కూడా జగన్ పిలిపించి మాట్లాడలేదు. అప్పుడు కూడా ఇలాంటి అలకలొచ్చాయి కానీ బాలినేని సర్దుకుపోయారు. ఇప్పుడు మాత్రం బాలినేనిని స్టేజ్ పైనే కూల్ చేశారు జగన్. ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేసే అవ‌కాశాన్ని ఆయనకే అప్పగించారు. ఆయనతోనే ల్యాప్ టాప్ బటన్ నొక్కించారు. 

Tags:    
Advertisement

Similar News