అనంతపురానికి జగన్.. ఈరోజైనా మౌనం వీడతారా..?
నార్పల వేదికగా మరోసారి ప్రతిపక్షాలపై సీఎం జగన్ విమర్శలతో విరుచుకుపడతారనే చర్చ నడుస్తోంది. అయితే ఎప్పటిలాగే దుష్టచతుష్టయం అని సరిపెడతారా మరో అడుగు ముందుకేస్తారా అనేది తేలాల్సి ఉంది.
రాష్ట్ర ఖజానాలో నిధులు లేవనే కారణంతో వాయిదా పడిన జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించబోతున్నారు. అనంతపురం జిల్లా నార్పల గ్రామంలో జరిగే బహిరంగ సభలో వసతి దీవెన నిధులు విడుదల చేస్తారు సీఎం జగన్.
రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని జమ చేస్తుంది ప్రభుత్వం. దీంతో ఇప్పటి వరకు వసతి దీవెన కింద వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో రూ.4,275.76 కోట్లు జమ చేసినట్లు అవుతుంది.
ప్రతిపక్షాలకు మూడినట్టేనా..?
నార్పల వేదికగా మరోసారి ప్రతిపక్షాలపై సీఎం జగన్ విమర్శలతో విరుచుకుపడతారనే చర్చ నడుస్తోంది. అయితే ఎప్పటిలాగే దుష్ట చతుష్టయం అని సరిపెడతారా మరో అడుగు ముందుకేస్తారా అనేది తేలాల్సి ఉంది. చంద్రబాబు బీజేపీ పొత్తుకోసం అర్రులు చాస్తున్నారనే విషయం దాదాపుగా తేలిపోయింది. అందుకే జనసేనతో కలయికపై నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారని కూడా రుజువైంది.
ఈ దశలో జగన్ ఏపీ రాజకీయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాలి. విశాఖ ఉక్కు విషయంలో జరిగిన రాద్ధాంతంపై కూడా ఆయన స్పందిస్తారనే అంచనాలున్నాయి. ఈమధ్య ఉత్తరాంధ్రకు వెళ్లినప్పుడు విశాఖ రాజధానిపై హింట్ ఇచ్చారు. ఈరోజు కొనసాగింపుగా ఏదైనా మాట్లాడతారేమో చూడాలి.
ఆ విషయంలో మౌనం వీడతారా..?
వైఎస్ వివేకా హత్య కేసు విచారణ, అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ల వ్యవహారం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా ఉంది. దీనిపై జగన్ ఇప్పటి వరకు నేరుగా స్పందించలేదు. వైసీపీ నేతలు మాత్రం అవినాష్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతున్నారు, సీబీఐ విచారణపై విమర్శలు చేస్తున్నారు. కానీ, సీఎం జగన్ ని వివేకా హత్యకేసు విషయంలో ప్రతిపక్షాలు ఇరుకున పెట్టాలని చూస్తున్నాయి. ఈ విషయంపై జగన్ స్పందిస్తారా, ప్రతిపక్షాలకు ఘాటు జవాబు ఇస్తారా అనేది వేచి చూడాలి.