అమ్మఒడి, విద్యా దీవెన, కళ్యాణమస్తు.. ఏదీ మిస్ కావొద్దు -జగన్
కళ్యాణమస్తు పథకానికి పదో తరగతి అర్హత అనే నిబంధన తీసుకొచ్చామని దీనివల్ల ప్రతి కుటుంబంలో చదువుకునేవారి సంఖ్య పెరుగుతోందని చెప్పారు సీఎం జగన్.
ఏపీలో దశల వారీగా విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని, ఏదీ ఎవరికీ మిస్ కాకూడదనే ఉద్దేశంతోటే ఆయా పథకాలకు నిబంధనలు పెట్టామని వివరించారు సీఎం జగన్. విద్యార్థులకు మొదటి ప్రోత్సాహకం స్కూల్ లో ఇచ్చే అమ్మఒడి అని చెప్పారు. ఆ తర్వాత కాలేజీ వయసులో విద్యా దీవెన, వసతి దీవెన.. రెండో ప్రోత్సాహకంగా ఉంటాయన్నారు. మూడో ప్రోత్సాహకం కళ్యాణమస్తు, షాదీ తోఫా అని వివరించారు.
నిబంధనలు ఎందుకు పెట్టామంటే..?
కళ్యాణమస్తు పథకానికి పదో తరగతి అర్హత అనే నిబంధన తీసుకొచ్చామని దీనివల్ల ప్రతి కుటుంబంలో చదువుకునేవారి సంఖ్య పెరుగుతోందని చెప్పారు సీఎం జగన్. కనీసం పదో తరగతి వరకయినా పేద పిల్లలు చదువుకుంటారనే ఉద్దేశంతోనే ఆ నిబంధన పెట్టామని వివరించారు. దీంతో కచ్చితంగా వారికి అమ్మఒడి వస్తుందని, పెళ్లికి వయసు నిబంధన ఎలాగూ ఉంది కాబట్టి.. టెన్త్ పాసయినవారు కాలేజీలో జాయిన్ అవుతారని, తద్వారా విద్యా దీవెన, హాస్టల్ లో ఉంటే వసతి దీవెన వస్తాయన్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే కళ్యాణమస్తు, షాదీ తోఫా పేరుతో ఆర్థిక సాయం చేస్తామన్నారు. అంటే.. ఈ నిబంధనల వల్ల పిల్లలు చదువుకోవడంతోపాటు, వారికి అమ్మఒడి, విద్యా దీవెన, కళ్యాణమస్తు డబ్బులు ఏవీ.. మిస్ కాకుండా అందుతాయని వివరించారు.
ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య కాలంలో పెళ్లి చేసుకున్న 12,132 మంది లబ్ధిదారులకు రూ.87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ ఈరోజు బటన్ నొక్కి అందించారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకోసమే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిందని, కానీ తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వీటిని అమలు చేస్తోందన్నారు. చంద్రబాబు 17709 మంది జంటలకు.. దాదాపు 70కోట్ల రూపాయలు ఎగరగొట్టారని విమర్శించారు. తమ హయాంలో ప్రతి కేటగిరీలోనూ ఆర్థిక సాయం పెంచి అందిస్తున్నామని చెప్పారు.