అన్నీ పెంచేశాం.. మరోసారి బటన్ నొక్కిన సీఎం జగన్
డ్రాపౌట్ రేటు తగ్గించడమే లక్ష్యంగా కల్యాణ మస్తు, షాదీ తోఫా పథకాలు అమలవుతున్నాయని చెప్పారు సీఎం జగన్. ఈ పథకానికి అర్హులు కావాలంటే వధూవరులకు 10వ తరగతి ఉత్తీర్ణత అందుకే తప్పనిసరి చేశామన్నారు.
నిన్న మొన్నటి వరకూ బటన్ నొక్కడం, డబ్బులు పంచడం అంటూ ప్రతిపక్షాలు సీఎం జగన్ ని విమర్శించేవి. కానీ ఇటీవల కాలంలో జగన్, బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నానంటూ తనకు తానే ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా మరోసారి జగన్ అలా బటన్ నొక్కి రూ.38.18 కోట్ల ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులకు అందజేశారు. వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా.. పథకాల ద్వారా ఇటీవల వివాహం చేసుకున్న 4,536 మందికి ఆర్థిక సాయాన్ని వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేశారు.
అన్నీ పెంచేశాం..
గత ప్రభుత్వానికీ తమ ప్రభుత్వానికీ తేడా చూడాలని సీఎం జగన్ ప్రజల్ని కోరారు. గత ప్రభుత్వం బీసీల కులాంతర వివాహాలకు రూ.50వేలు ఇస్తే.. తాము రూ.75వేలకు ఆర్థిక సాయాన్ని పెంచి అందిస్తున్నామని చెప్పారు. మైనారీలకు టీడీపీ ప్రభుత్వం రూ.50వేలు, తమ ప్రభుత్వం లక్ష రూపాయలు ఇస్తోందన్నారు. భవన నిర్మాణ కార్మికులు, ఇతర కార్మికులకు గతంలో రూ.20వేలు ఇస్తుంటే, ఇప్పుడు ఆ సాయాన్ని రెట్టింపు చేశామని చెప్పారు. గత ప్రభుత్వం వికలాంగులకు లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించి మోసం చిందని, తమ ప్రభుత్వం వికలాంగులను ఆదుకుని లక్షా50వేల రూపాయలు అందిస్తోందన్నారు.
చదువుతోనే భవిత..
డ్రాపౌట్ రేటు తగ్గించడమే లక్ష్యంగా కల్యాణ మస్తు, షాదీ తోఫా పథకాలు అమలవుతున్నాయని చెప్పారు సీఎం జగన్. ఈ పథకానికి అర్హులు కావాలంటే వధూవరులకు 10వ తరగతి ఉత్తీర్ణత అందుకే తప్పనిసరి చేశామన్నారు. పెళ్లి కోసం కొంతకాలం ఆగొచ్చు కానీ చదువులు ఆగిపోకూడదన్నారు జగన్. అమ్మాయిలు చదువుల బాట పడితేనే సమాజం బాగుపడుతుందని చెప్పారు. ప్రపంచంలో పోటీ విపరీతంగా ఉంది. పిల్లలు ఎక్కడకు వెళ్లినా.. గెలిచే పరిస్థితి ఉండాలని, అందుకే చదువుకోవాలన్నారు.
లంచాలు, వివక్షతకు తావులేకుండా ఈ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు సీఎం జగన్. అక్టోబరు-డిసెంబర్ మధ్య పెళ్లి చేసుకున్నవారికి దరఖాస్తు చేసుకోవడానికి ఒక నెల సమయం ఇచ్చామని, ఫిబ్రవరిలో వెరిఫికేషన్ పూర్తిచేసి ఈరోజు వారికి నగదు జమచేస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరంలో ప్రతి మూడు నెలలకు సంబంధించి ఇలాగే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు.