ఇక అన్నీ స్పీడ్ గా జరిగిపోవాల్సిందే –జగన్

ఒప్పందాలు కుదుర్చుకున్న పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా తోడుగా ఉంటుందని.. వేగంగా పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలూ కల్పిస్తుందని తెలిపారు.

Advertisement
Update:2023-03-05 08:00 IST

విశాఖలో జరిగింది ఎంఓయూలే కదా, ఆ పనులు గ్రౌండింగ్ కావాలి కదా అంటూ టీడీపీ వెటకారంగా మాట్లాడుతోంది. గతంలో ఉన్నది మాటల ప్రభుత్వం, గ్రాఫిక్స్ ప్రభుత్వం.. తమది చేతల ప్రభుత్వం అంటున్నారు వైసీపీ నేతలు. ప్రస్తుతం విశాఖ గ్లోబల్ సమ్మిట్ లో 350కి పైగా ఎంఓయూలు కుదిరాయి. వీటి విలువ 13 లక్షలకోట్ల రూపాయల పైమాటే. ఇవన్నీ అమలులోకి వస్తే 6లక్షలమందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇదంతా ఎప్పుడు..? ప్రస్తుతం జరిగింది కేవలం ఒప్పందాలు మాత్రమే.. ఆ ఒప్పందాలు అమలులోకి రావాలంటే మరికొంత సమయం పడుతుంది. అయితే అదంతా స్పీడ్ గా జరిగిపోవాల్సిందేనంటున్నారు సీఎం జగన్. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న పారిశ్రామికవేత్తలు వీలైనంత త్వరగా వాటిని ఆచరణలోకి తేవాలని కోరారు, రాష్ట్రంలో త్వరగా కార్యకలాపాలు ప్రారంభించాలన్నారు.

మీకు అండగా మేము..

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ టాప్ ప్లేస్ లో ఉందని, అది చేతల్లో కూడా చూపిస్తామంటున్నారు సీఎం జగన్. ఒప్పందాలు కుదుర్చుకున్న పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా తోడుగా ఉంటుందని.. వేగంగా పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలూ కల్పిస్తుందని తెలిపారు. రెండు రోజుల సదస్సులో జరిగిన పెట్టుబడుల ఒప్పందాల పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సభ్యులుగా ఉండే ఆ కమిటీ ప్రతి వారం సమావేశమై.. ఒప్పందాల అమలు ఏమేరకు వచ్చిందో పరిశీలిస్తుందని, వాటి అమలుకోసం ప్రత్యేక కృషి చేస్తుందని చెప్పారు. అనుమతులపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుగుతాయన్నారు.

ఇది కీలక సమయం..

అత్యంత కీలకమైన సమయంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించామన్నారు జగన్. దేశ, విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలమైన గమ్యస్థానంగా ఏపీని రూపొందించడంలో ఈ సదస్సు కీలకపాత్ర పోషించిందని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావడంతో తమ ఆత్మవిశ్వాసం రెట్టింపయిందని, రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించాలనే కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పారు జగన్. కొవిడ్‌ సమయంలో ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా రాష్ట్రంలో వ్యాపార రంగాలకు ప్రోత్సాహమిచ్చామనే విషయాన్ని గుర్తు చేశారు జగన్. ద్రవ్యలోటు నియంత్రణలో ఉంచి, వ్యాపారాలు ప్రమాదంలో పడకుండా చూశామని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News