పేదవాడు ఒకవైపు, పెత్తందార్లు మరోవైపు

ఈరోజు జరుగుతోంది కుల సంగ్రామం కాదని, క్లాస్ వార్ అని అన్నారు జగన్. పేదవాడు ఒకవైపు, పెత్తందార్లంతా మరోవైపు ఉన్నారని, ఎవరిని గెలిపించాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.

Advertisement
Update:2023-05-24 15:28 IST

జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వెళ్లిన సీఎం జగన్ ప్రతిపక్షాలపై మరోసారి విరుచుకుపడ్డారు. క్లాస్ పాలిటిక్స్ ని మరోసారి తెరపైకి తెచ్చారు. ఈరోజు జరుగుతోంది కుల సంగ్రామం కాదని, క్లాస్ వార్ అని అన్నారు జగన్. పేదవాడు ఒకవైపు, పెత్తందార్లంతా మరోవైపు ఉన్నారని, ఎవరిని గెలిపించాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.

ఎవరేం చెప్పినా నమ్మొద్దు..

ఎన్నికల సమయంలో చాలామంది వచ్చి రకరకాలుగా చెబుతుంటారని, కానీ అవేవీ నమ్మొద్దని, మీ ఇంట్లో మీకు మంచి జరిగిందని మీరు భావిస్తే జగనన్నకు తోడుగా నిలబడండి అని పిలుపునిచ్చారు సీఎం. నా బలం మీరే, నా నమ్మకం మీరే అంటూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తోడేళ్ల గుంపు ఏకమవుతోందని, తనకి వ్యతిరేకంగా అందరూ జట్టుకడుతున్నారని చెప్పారు జగన్. వారిలాగా తనకు మీడియా సపోర్ట్, దత్తపుత్రుడి సపోర్ట్ లేదని చెప్పారు. వారిదంతా దోచుకోవడం, పంచుకోవడమేనని అన్నారు.


విద్యతోనే మార్పు..

ఏపీలో విద్యావ్యవస్థలో సమూలంగా మార్పులు తెచ్చామని, మీరు ఏం చదువుతారో, ఎంత వరకు చదువుతారో మీ ఇష్టం, మీకు అండగా మీ మేనమామ ఉన్నారని గుర్తు పెట్టుకోండి అంటూ విద్యార్థులకు చెప్పారు జగన్. గత ప్రభుత్వం అరకొర ఫీజులను విదిలించేదని, కానీ ఇప్పుడు నేరుగా తల్లుల ఖాతాల్లోకే ఫీజు మొత్తం ట్రాన్స్ ఫర్ చేస్తున్నామని పూర్తి స్థాయిలో ఫీజు రీఎంబర్స్ మెంట్ చేస్తున్నామన్నారు జగన్. ఇంగ్లిష్ మీడియం సహా విద్యావ్యవస్థలో చేసిన మార్పులన్నీ సత్ఫలితాలిస్తాయన్నారు. ఇది భవిష్యత్ తరాలపై పెడుతున్న పెట్టుబడి అని చెప్పారు జగన్. సమాజంలో పేదరికం పోవాలంటే, ప్రతి పేదింటి బిడ్డ బాగా చదువుకోవాలని, ఉన్నతోద్యోగాల్లో స్థిరపడాలని చెప్పారు. దానికి కావాల్సిన సాయం ప్రభుత్వం అందిస్తుందన్నారు. 

Tags:    
Advertisement

Similar News