అది కక్షసాధింపు కాదు.. జగన్ కళ్లలో ఆనందం
పనిగట్టుకుని చంద్రబాబుని జగన్ అరెస్ట్ చేయించారని చెప్పలేం, అలాగని.. అసలా అరెస్ట్ గురించి తనకు తెలియదని జగన్ చెప్పినా నమ్మలేం. చంద్రబాబుపై తనకు కక్ష లేదు అని జగన్ చెబితే వైసీపీ నేతలు నమ్ముతారా..? అందుకే జగన్ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు.
చంద్రబాబు అరెస్ట్, జైలు జీవితం గురించి సీఎం జగన్ తొలిసారిగా కాస్త సుదీర్ఘంగా స్పందించారు. అసలు అది కక్షసాధింపు అని ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుపై తనకు ఎలాంటి కక్ష లేదన్నారు. అసలా అరెస్ట్ కూడా తాను లండన్ లో ఉన్నప్పుడు జరిగిందన్నారు. తాను ఏపీలో లేనప్పుడు జరిగిన దానికి తానెలా బాధ్యుడినవుతానన్నారు జగన్. అందులోనూ కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా చంద్రబాబుని టార్గెట్ చేశాయని, కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా అని ప్రశ్నించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబుకి వదిన అని, ఆ పార్టీలో ఉన్నది సగం మందికి పైగా టీడీపీ నేతలేనని వివరించారు. చంద్రబాబు దత్తపుత్రుడు కూడా బీజేపీతోనే కలసి ఉన్నాడని గుర్తు చేశారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం ఎందుకవుతుందని, ఆయన చేసిన అక్రమాల వల్లే అరెస్ట్ అయ్యారని చెప్పారు.
జగన్ మందహాసం..
చంద్రబాబు అరెస్ట్ గురించి చెబుతున్నప్పుడు జగన్ కళ్లలో ఆనందం స్పష్టంగా కనపడింది. పనిగట్టుకుని చంద్రబాబుని జగన్ అరెస్ట్ చేయించారని చెప్పలేం, అలాగని.. అసలా అరెస్ట్ గురించి తనకు తెలియదని జగన్ చెప్పినా నమ్మలేం. చంద్రబాబుపై తనకు కక్ష లేదు అని జగన్ చెబితే వైసీపీ నేతలు నమ్ముతారా..? అందుకే జగన్ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు అరెస్ట్ గురించి జగన్ చెబుతుంటే చప్పట్లు, ఈలలు, కేకలతో ఆ ప్రాంగణం అంతా మారుమోగిపోయింది.
సున్నా ప్లస్ సున్నా..
టీడీపీ, జనసేన పొత్తులపై కూడా జగన్ పంచ్ లు విసిరారు. రెండు సున్నాలు కలిసినా, నాలుగు సున్నాలు కలిసినా వచ్చేది సున్నానే అని కౌంటర్ ఇచ్చారు. ఒకడు పార్టీ పెట్టి 15 ఏళ్లు అయ్యింది అయినా ఇప్పటికీ నియోజకవర్గంలో నాయకులు లేరు.. గ్రామాల్లో జెండా మోసే కార్యకర్త లేడు.. ఆయన జీవితం అంతా చంద్రబాబును భుజాలపై మోయటానికే సరిపోతుంది అంటూ పవన్ కి చురకలంటించారు. బిస్కెట్లు, చాక్లెట్లు పంచినట్లు దత్తపుత్రుడికి, తమ అనుచరులకు ప్రభుత్వ సొమ్ము చంద్రబాబు పంచిపెట్టారని విమర్శించారు జగన్.