క్యూలైన్లో కుమ్ములాట.. ఇద్దరికి గాయాలు..

క్యూలైన్లో బాత్ రూమ్ కి దారివ్వాలని అడిగే క్రమంలో తమిళనాడు భక్తులకు, గుంటూరు భక్తులకు మధ్య వాగ్వాదం మొదలైంది. మాటా మాటా పెరిగి తోపులాట జరిగింది.

Advertisement
Update:2022-10-11 06:51 IST

తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లోకి ప్రవేశిస్తే రెండు రోజులు అక్కడే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. బ్రహ్మోత్సవాల రద్దీ తగ్గినా పెరటాశి మాసం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనానికి వస్తున్నారు. 40 గంటలకు పైగా క్యూలైన్లో వేచి ఉండటం అంటే మాటలు కాదు. తోపులాట, ఉక్కపోత, స్వామి దర్శనం ఎప్పుడవుతుందోనన్న ఆతృత.. వీటన్నిటి మధ్య క్యూలైన్లో అక్కడక్కడా భక్తుల మధ్య మాటా మాటా పెరుగుతోంది. అయితే ఈ మాటల యుద్ధం శృతిమించి ముష్టిఘాతాలకు దారి తీసింది. తిరుమల క్యూలైన్లో భక్తులు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో ఇద్దరికి గాయాలయ్యాయి.

తమిళనాడు వర్సెస్ గుంటూరు..

పెరటాశి మాసం కావడంతో తమిళనాడుకి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. ఇటు ఏపీ భక్తులు కూడా తిరుమల యాత్రకు వస్తున్నారు. క్యూలైన్లో బాత్ రూమ్ కి దారివ్వాలని అడిగే క్రమంలో తమిళనాడు భక్తులకు, గుంటూరు భక్తులకు మధ్య వాగ్వాదం మొదలైంది. మాటా మాటా పెరిగి తోపులాట జరిగింది. తమిళనాడు భక్తులు ఎక్కువమంది ఉండటంతో.. వారు ఒక్కసారిగా గుంటూరు భక్తులపై పడిపోయారు. పక్కనున్నవారు సర్ది చెప్పినా ఫలితం లేదు. తమిళనాడు భక్తుల దాడిలో ఇద్దరు గుంటూరు భక్తులకు దెబ్బలు తగిలాయి. వారికి ఫస్ట్ ఎయిడ్ చేశారు.

భారీ రద్దీతో సమస్యలు..

తిరుమలలో విపరీతమైన రద్దీ ఉంది. సర్వదర్శనానికి రెండు రోజుల టైమ్ పడుతోంది. రద్దీ ఎక్కువగా ఉందని, భక్తులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తున్నా ఫలితం లేదు. సర్వదర్శనం కోసం ఎక్కడెక్కడినుంచో భక్తులు వస్తున్నారు. వారికి వసతి సౌకర్యాలు కల్పించడానికి టీటీడీ అష్టకష్టాలు పడుతోంది. అదే సమయంలో క్యూలైన్లో వేచి ఉంటున్నవారికి కూడా సౌకర్యాలు కల్పిస్తోంది. కానీ 2 రోజులపాటు వెయిటింగ్ అంటే మాటలు కాదు. అసహనంతో కొన్నిసార్లు ఇలాంటి అపశృతులు దొర్లుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News