లోకేష్‌కు ‘రెడ్ బుక్’ షాకిస్తుందా..?

కొంతకాలంగా లోకేష్ ఎక్కడ మాట్లాడినా, ముఖ్యంగా పాదయాత్ర సాగినన్ని రోజులు పదేపదే అధికారులను బెదిరించటం అందరు చూసిందే.

Advertisement
Update:2023-12-23 10:26 IST

లోకేష్ అరెస్టుపై ఉత్కంఠ మొదలైంది. అరెస్టుకు అనుమతించాలని కోరుతూ సీఐడీ అధికారులు ఏసీబీ ప్రత్యేక కోర్టుతో పాటు హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో 14వ నిందితుడుగా ఉన్న లోకేష్ దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులను, సాక్ష్యులను బెదిరిస్తున్నారని సీఐడీ తన పిటీషన్లో ఆరోపించింది. సెక్షన్ 41ఏ నోటీసులోని షరతులన్నింటినీ లోకేష్ ఉల్లంఘించినట్లు చెప్పింది. లోకేష్‌కు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగులను కూడా జతచేసింది.

కొంతకాలంగా లోకేష్ ఎక్కడ మాట్లాడినా, ముఖ్యంగా పాదయాత్ర సాగినన్ని రోజులు పదేపదే అధికారులను బెదిరించటం అందరు చూసిందే. రోడ్డు షోలు, ర్యాలీలు, సభల్లో ఒక రెడ్ బుక్‌ను చూపించి తమను ఇబ్బంది పెట్టిన అధికారుల పేర్లను నోట్ చేసుకుంటున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. టీడీపీ నేతలపై కేసులు నమోదు చేసిన అధికారుల పేర్లను రాసుకుంటున్నట్లు చెప్పారు. తాము అధికారంలోకి రాగానే ఒక్కొక్కళ్ళ కథేంటో చెబుతానని చాలాసార్లు బెదిరించారు. టీడీపీని ఇబ్బందిపెట్టిన ఏ అధికారినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా వార్నింగుల మీద వార్నింగులిచ్చారు.

లోకేష్ లాగ రెడ్ బుక్ అని కాకపోయినా చంద్రబాబునాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు కూడా ఇలాంటి వార్నింగులే చాలాసార్లిచ్చారు. లోకేష్ చూపించిన రెడ్ బుక్ వార్నింగులనే ఇప్పుడు సీఐడీ రెండుకోర్టుల్లోనూ కేసుల్లో ప్రస్తావించింది. పిటీషన్ వేసే బదులు డైరెక్టుగా లోకేష్ ను అరెస్టు చేయచ్చు కదాని జడ్జి అడిగారు. అందుకు సీఐడీ బదులిస్తూ అరెస్టుచేసే అవకాశమున్నా ముందుగా కోర్టుకు అనుమతి తీసుకుని అరెస్టు చేద్దామని అనుకున్నట్లు చెప్పారు.

అరెస్టుకు అనుమతి అడిగినప్పుడు జతచేసిన వీడియోలను చూసిన తర్వాత ఏ సంగతి నిర్ణయిస్తామని జడ్జి కేసును 28వ తేదీకి వాయిదా వేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. అధికారంలో ఉన్న పార్టీ చెప్పినట్లుగా నడుచుకోవటానికి చాలామంది అధికారులు అలవాటు పడిపోయారు. చంద్రబాబు హయాంలో కూడా చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలపైన చాలా కేసులుపెట్టటమే కాకుండా ఎంతోమందిని అరెస్టులు చేయించారు. ఆ విషయాన్ని మరచిపోయిన లోకేష్, చంద్రబాబు ఇప్పుడు గోలచేస్తుండమే విచిత్రంగా ఉంది. మరి 28వ తేదీన విచారణలో లోకేష్ అరెస్టుపై జడ్జి ఏమంటారో చూడాలి.

Tags:    
Advertisement

Similar News