ప్రచారానికి చిరంజీవి దూరం.. స్పెషల్ వీడియో విడుదల

పిఠాపురం ప్రచారానికి దూరంగా ఉండాలని చిరంజీవి ఫిక్స్ అయ్యారు. వీడియో విడుదల చేసి సరిపెట్టారు.

Advertisement
Update:2024-05-07 11:35 IST

ఏపీ ఎన్నికల ప్రచార పర్వానికి డెడ్ లైన్ దగ్గరపడింది. నేటితో కలిపి మరో ఐదురోజులు మాత్రమే మైకులు పనిచేస్తాయి. మే 11 సాయంత్రమే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. 13వతేదీ ఉదయం ఎన్నికలు జరుగుతాయి. అయితే చిరంజీవి మాత్రం ఇంకా ప్రచారానికి రాలేదు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ కి మద్దతుగా చిరంజీవి వస్తారనే ప్రచారం జరిగింది. కానీ పోలింగ్ కి రోజులు దగ్గరపడినా మెగాస్టార్ ఇంకా రాలేదు, ఇకపై రాడు కూడా అనే నమ్మకం అభిమానుల్లో బలపడుతోంది. ఈ దశలో చిరంజీవి ఓ వీడియో విడుదల చేసి సరిపెట్టారు.


పిఠాపురంలో పవన్ తరపున ఆల్రడీ మెగా ఫ్యామిలీ ప్రచారం చేస్తోంది. నాగబాబు, ఆయన సతీమణి, నాగబాబు కొడుకు వరుణ్ తేజ్, పవన్ కల్యాణ్ మేనళ్లుల్లు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ప్రచారానికి వచ్చారు. జబర్దస్త్ టీమ్ కూడా రంగంలోకి దిగింది. ఇక చిరంజీవి మాత్రమే బ్యాలెన్స్, ఆయన కూడా వచ్చేస్తారని అనుకుంటున్నారు. కానీ చిరంజీవి రాకపోవచ్చు అనే వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. దానికి బలమైన కారణం కూడా ఉందని అంటున్నారు.

జనసేనకు చెక్కు బహూకరించినప్పుడే చిరంజీవిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఆ తర్వాత కూటమి నేతలు సీఎం రమేష్, మరికొందరికి ఆయన మద్దతు తెలుపుతూ వీడయో రిలీజ్ చేసినప్పుడు కూడా మెగాస్టార్ పై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఇలాంటి విమర్శలను ఎదుర్కోవడం చిరంజీవికి అస్సలు ఇష్టముండదు. అందుకే ఆయన చాన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ముద్రగడ పద్మనాభం, పవన్ కల్యాణ్ ని విమర్శించే క్రమంలో మెగా ఫ్యామిలీపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ చిరంజీవి ప్రచారానికి వస్తే, ఇలాంటి విమర్శలన్నిటికీ ఆయన బదులు చెప్పాల్సి వస్తుంది. అదే మొదలైతే.. అక్కడితో ఆ కౌంటర్లు ఆగిపోవు. వాటికి మళ్లీ కొనసాగింపు ఉంటుంది. ఎన్నికలు పూర్తయినా కూడా సోషల్ మీడియా ఎక్కడో ఓ చోట అవి హైలైట్ అవుతూనే ఉంటాయి. అంటే ముద్రగడ వ్యాఖ్యలకు మెగా ఫ్యామిలీ రియాక్ట్ అయితే ఆ ఎపిసోడ్ లు కొనసాగే అవకాశముంది. ఇక చిరంజీవి ప్రచారానికి వస్తే కచ్చితంగా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయాల్సి ఉంటుంది. విమర్శలు చేస్తే ప్రతి విమర్శలకు కూడా ఆయన సిద్ధపడినట్టే లెక్క. కానీ చిరంజీవి ఆ రిస్క్ చేయాలనుకోవట్లేదు, అందుకే తమ్ముడి పార్టీకి చెక్కు ఇచ్చి సరిపెట్టారు. పిఠాపురం ప్రచారానికి దూరంగా ఉండాలని చిరంజీవి ఫిక్స్ అయ్యారు. వీడియో మాత్రం విడుదల చేశారు. 

Tags:    
Advertisement

Similar News