తిరుమ‌ల బ్రేక్ ద‌ర్శ‌న వేళ‌ల్లో మార్పు

స‌ర్వ‌ద‌ర్శ‌న భ‌క్తుల సౌక‌ర్యార్థం టీటీడీ బ్రేక్ ద‌ర్శ‌న వేళ‌ల‌ను మార్పు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం టిక్కెట్లున్న భ‌క్తులను ఉద‌యం 8 గంట‌ల నుంచి ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌నున్నారు.

Advertisement
Update:2022-11-30 10:52 IST

తిరుమ‌ల శ్రీవారి ఆల‌యంలో బ్రేక్ ద‌ర్శ‌న వేళ‌ల‌ను మార్పు చేస్తూ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన పాల‌క మండ‌లి నిర్ణయం తీసుకుంది. డిసెంబ‌ర్ 1 నుంచి ఈ మార్పు అమ‌లులోకి రానుంది. నెల రోజుల పాటు దీనిని ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేయ‌నున్నారు. వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం టిక్కెట్లున్న భ‌క్తుల‌కు ప్ర‌స్తుతం ఉద‌యం 6 గంట‌ల‌కు ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తున్నారు. గురువారం నుంచి ఈ భ‌క్తుల‌ను ఉద‌యం 8 గంట‌ల నుంచి ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌నున్నారు.

స‌ర్వ‌ద‌ర్శ‌న భ‌క్తుల సౌక‌ర్యార్థం టీటీడీ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ముందురోజు రాత్రి 12 గంట‌ల‌కు నిలిపివేసిన స‌ర్వ ద‌ర్శ‌న క్యూలైన్ త‌ర్వాతి రోజు ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌వుతుండ‌టంతో భ‌క్తుల నిరీక్ష‌ణ స‌మ‌యం పెరుగుతూ వ‌స్తోంది.

ప్ర‌స్తుతం తాజా నిర్ణ‌యం ప్ర‌కారం.. వేకువ‌జామున ఆల‌యం తెరిచి శ్రీ‌వారికి కైంక‌ర్యాలు, నివేద‌న‌లు పూర్తిచేసిన అనంత‌రం స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌నున్నారు. ఆ త‌ర్వాత వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం టికెట్లున్న‌వారిని ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. దీనివ‌ల్ల స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు నిరీక్షణ స‌మ‌యం త‌గ్గుతుంద‌ని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. దీనిని నెల రోజుల‌పాటు ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేయ‌నున్నారు. తాజా నిర్ణ‌యంతో వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌న భ‌క్తులు ఏరోజుకారోజు నేరుగా తిరుప‌తి నుంచి తిరుమ‌ల‌కు వ‌చ్చి ద‌ర్శ‌నం చేసుకునే అవ‌కాశం ఉంటుంది. దీనివ‌ల్ల వ‌స‌తి గ‌దుల కేటాయింపులోనూ ఒత్తిడి త‌గ్గుతుంద‌ని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News