నింగిలోకి చంద్రయాన్-3.. ఆగస్ట్ వరకు ఉత్కంఠ..
చంద్రయాన్-3 విజయవంతంగా భూ కక్ష్యలోకి చేరుకుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్ట్ 23 లేదా, 24 తేదీల్లో చంద్రయాన్-3 చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది.
25 గంటల 30నిమిషాల సుదీర్ఘ కౌంట్ డౌన్ అనంతరం చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లింది. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల 35నిమిషాలకు శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి LVM-3P4 రాకెట్ ద్వారా చంద్రయాన్ మిషన్ నింగిలోకి బయలుదేరింది. సహజంగా మిగతా ప్రయోగాల విజయాలన్నీ నిమిషాల వ్యవధిలో తేలిపోతాయి. కానీ చంద్రయాన్ సక్సెస్ అయిందా లేదా అనేది తేలాలంటే ఆగస్ట్ వరకు వేచి చూడాల్సిందే. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్ట్ 23 లేదా, 24 తేదీల్లో చంద్రయాన్-3 చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. అప్పటి వరకు ఇస్రో శాస్త్రవేత్తల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ దేశమూ వెళ్లని చంద్రుడి రెండో వైపుకి ల్యాండర్, రోవర్ లను భారత్ పంపిస్తోంది. దీంతో అన్ని దేశాల చూపు మనవైపే ఉంది.
చంద్రయాన్-2 ఎక్కడ ఫెయిలైందో.. అక్కడినుంచే చంద్రయాన్-3 ప్రస్థానం మొదలైంది. ఈసారి ఫెయిలయ్యే ఛాన్స్ లేకుండా పక్కాగా చంద్రుడిపై భారత్ ముద్ర పడేలా ఇస్రో ప్రణాళికలు రూపొందించింది. అనుకున్న ప్రదేశంలో రోవర్ చంద్రుడిపై దిగేందుకు పరిస్థితులు సహకరించకపోతే.. అప్పటికప్పుడే మరో ప్రాంతాన్ని వెదుక్కుని అక్కడ ల్యాండ్ అయ్యేందుకు అవసరమైన అదనపు ఇంధనాన్ని కూడా అందులో ఉంచారు. ఇక్కడినుంచి పగడ్బందీగా మిషన్ ని ఆపరేట్ చేస్తున్నారు.
చంద్రయాన్–3 బరువు 3,920 కిలోలు. దాదాపు 3.84 లక్షల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ముందు రాకెట్ నుంచి విడిపోయిన రోవర్ భూ కక్ష్యలో పరిభ్రమించి అనంతరం చంద్రుడి కక్ష్యలోకి వెళ్తుంది. ఆ తర్వాత ల్యాండింగ్ కి ఏర్పాట్లు చేస్తారు. అనువైన సమయం చూసుకుని ఆగస్ట్ 23, లేదా 24 తేదీల్లో రోవర్ ని చంద్రుడిపై దించుతారు. చంద్రడిపై లోతుగా అధ్యయనం చేసి, అక్కడ దాగున్న అనేక రహస్యాలను వెలికి తీయడమే చంద్రయాన్–3 ప్రయోగం ప్రధాన లక్ష్యం.