అసమర్థ కొడుకును హైలైట్‌ చేద్దామనేదే బాబు తాపత్రయం

లోకేష్‌ నిర్వహించిన పాదయాత్ర ఒక అశుభయాత్ర అని అంబటి రాంబాబు చెప్పారు. లోకేష్‌ కుప్పంలో అడుగు పెట్టగానే నందమూరి తారకరత్న మృతి చెందారని గుర్తుచేశారు.

Advertisement
Update:2023-12-20 07:53 IST

అసమర్థుడైన తన కొడుకు నారా లోకేష్‌ని హైలైట్‌ చేయాలనే తాపత్రయంతో నారా చంద్రబాబు నాయుడు నానా తంటాలు పడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. నారా లోకేష్‌ నిర్వహించిన పాదయాత్ర ఎవరూ గుర్తించని యాత్ర అని ఆయన చెప్పారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అంబటి మాట్లాడుతూ.. లోకేష్‌ నిర్వహించిన పాదయాత్ర వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా అని ప్రశ్నించారు. కనీసం లోకేష్‌కైనా, పార్టీకైనా ఈ యాత్ర ఉపయోగపడిందా అని ఎద్దేవా చేశారు. ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా తెల్లగా మారదనే వేమన ప‌ద్యంలా లోకేష్‌ యాత్ర సాగిందని ఆయన చెప్పారు. లోకేష్‌ చేసిన పాదయాత్ర వల్ల అతని ఒళ్లు తగ్గిందే తప్ప, మైండ్‌ మెచ్యూరిటీ రాలేదని తెలిపారు.

లోకేష్‌ది అశుభయాత్ర..

లోకేష్‌ నిర్వహించిన పాదయాత్ర ఒక అశుభయాత్ర అని అంబటి రాంబాబు చెప్పారు. లోకేష్‌ కుప్పంలో అడుగు పెట్టగానే నందమూరి తారకరత్న మృతి చెందారని గుర్తుచేశారు. లోకేష్‌ పాదయాత్ర జనం లేక వెలవెలబోయిన రోజులు ఎన్నో ఉన్నాయని ఆయన చెప్పారు. పచ్చ మీడియా మాత్రం పాదయాత్రకు విపరీతంగా జనం వచ్చారని ప్రచారం చేయడానికి తెగ ప్రయత్నం చేసిందని తెలిపారు. లోకేష్‌ యాత్రకు జనం లేకపోవడంతో చివరికి యాంకర్‌ ఉదయభానుని తెచ్చి మీటింగ్‌ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంబటి ఎద్దేవా చేశారు.

అడుగడుగునా బయటపడిన లోకేష్‌ అజ్ఞానం...

లోకేష్‌ నిర్వహించిన పాదయాత్రలో అడుగడుగునా అతని అజ్ఞానమే బయటపడిందని మంత్రి అంబటి చెప్పారు. ఒకచోట.. బీసీ, ఎస్సీ, ఎస్టీ చౌదర్లులారా.. అంటూ లోకేష్‌ మాట్లాడారని, మరోచోట.. మూడు పదిహేను వేలు తొంభై వేలు.. అని చెప్పిన అజ్ఞాని లోకేష్‌ అని వివరించారు. సోదరుడికి, చౌదరికి తేడా తెలీని వ్యక్తి లోకేష్‌ అని చెప్పారు. ప్రజల్లో గెలవకుండా మంత్రి అయిన వ్యక్తి లోకేష్‌ అని, అలాంటి వారికి ప్రజల కష్టాలేం తెలుస్తాయని ఆయన విమర్శించారు.

లోకేష్‌ సభకు ఇద్దరు యాంకర్లు...

లోకేష్‌ పాదయాత్ర ముగిసిన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహించ తలపెట్టారని, అసమర్థుడైన కొడుకును హైలైట్‌ చేయడం కోసం వృద్ధ తండ్రి చంద్రబాబు ఈ సభకు ఇద్దరు యాంకర్లను సిద్ధం చేశాడని మంత్రి అంబటి ఎద్దేవా చేశారు. ఆ యాంకర్లు ఎవరో కాదని.. ఒకరు లోకేష్‌కి పిల్లనిచ్చిన మామ బాలకృష్ణ కాగా, మరొకరు పవన్‌ కల్యాణ్‌ అని ఆయన చెప్పారు. వీరిద్దరూ ఈ సభలో యాంకరింగ్‌ చేయబోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. నిజంగా లోకేష్‌ సభ విజయవంతమైతే బాలకృష్ణ, పవన్‌ కల్యాణ్‌ల యాంకరింగ్‌ ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇంకా పవన్‌ కల్యాణ్‌ని ఈ యాంకరింగ్‌ కోసం ఒప్పించేందుకు చంద్రబాబు ఆయన ఇంటికెళ్లి.. సీట్లు, నోట్లు మాట్లాడుకుని మరీ ఒప్పించుకున్నారని తెలిపారు. కుంభకోణాల్లో సంపాదించిన సొమ్మంతా ఈ సభలో ఖర్చుపెడుతున్నారని విమర్శించారు.. ఫ్లైట్లు, రైళ్లలో జనాన్ని తరలిస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో 175 సీట్లు గెలవడమే లక్ష్యంగా తమ పార్టీ అధినేత మార్పులు చేర్పులు చేస్తున్నారని ఈ సందర్భంగా అంబటి తెలిపారు.

Tags:    
Advertisement

Similar News