ఢిల్లీకి చంద్రబాబు, అమిత్ షాతో భేటీ
అమిత్ షా,మోడీతో చంద్రబాబు భేటీని టీడీపీ మీడియా ధృవీకరిస్తున్నప్పటికీ ఎందుకు ఈ భేటీలు జరుగుతున్నాయి అన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు.
ఏపీలోని పొలిటికల్ పార్టీలతో బీజేపీ పెద్దలు ఏ గేమ్ ఆడుతున్నారో.. ఓపట్టాన అర్థం కావడం లేదు. జగన్ ప్రభుత్వానికి కావాల్సినన్ని అప్పులు ఇవ్వడమే కాకుండా, వివేకా కేసులో అవినాష్ అరెస్ట్ కాకుండా సహకరిస్తున్నదే బీజేపీ పెద్దలంటూ నిన్నటి వరకు టీడీపీ నాయకులు ఆరోపిస్తూ వచ్చారు. బీజేపీ- వైసీపీ ఒకటే అన్న ప్రచారమూ చేశారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా చంద్రబాబుకు బీజేపీ పెద్దల దర్శనభాగ్యం లభించడం ఆసక్తిగా ఉంది.
బీజేపీతో కటీఫ్ చెప్పినప్పటి నుంచి చంద్రబాబుకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా బీజేపీ పెద్దల నుంచి అందలేదు. ఎట్టకేలకు అమిత్‌షా, మోడీలను కలిసే అవకాశం చంద్రబాబుకు దక్కింది. నేడు రాత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీకి అపాయింట్‌మెంట్ ఓకే అయింది. మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు ఇందు కోసం ఢిల్లీ వెళ్తున్నారు. ఆదివారం ఉదయం మోడీతోనూ చంద్రబాబు భేటీ ఉంటుందని చెబుతున్నారు.
అమిత్ షా,మోడీతో చంద్రబాబు భేటీని టీడీపీ మీడియా ధృవీకరిస్తున్నప్పటికీ ఎందుకు ఈ భేటీలు జరుగుతున్నాయి అన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. బీజేపీతో కలిస్తే ఏపీలో జగన్‌ను నిలువరించవచ్చన్నది చంద్రబాబు చాలా కాలంగా చేస్తున్న ఆలోచన. అయితే బీజేపీపై ఏపీ ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆ పార్టీతో కలిస్తే చంద్రబాబు లాభపడుతారా..? మరోసారి తప్పుడు వ్యూహాంతో బోల్తా కొడుతారా..? అన్న చర్చ కూడా ఉంది.