కుమ్ములాటలకు చంద్రబాబే కారణమా?
టికెట్ వస్తుందన్న ఆశతో పార్టీ కార్యక్రమాల కోసం లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకుంటున్నారు. ప్రత్యర్ధి వర్గం టికెట్ దక్కకుండా అడ్డుకుంటోందని అనుమానాలు మొదలవ్వటంతోనే నేతల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. దీనివల్లే నేతలు ఒకరిపై మరొకరు దాడులకు తెగబడుతున్నారు.
పార్టీలో ఇంతకాలం తమ్ముళ్ళ మధ్య నివురుగప్పిన నిప్పులాగున్న వివాదాలన్నీ ఒక్కసారిగా బయటపడుతున్నాయి. ఒకవైపు ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. మరోవైపు నియోజకవర్గాల సమీక్షల్లో చంద్రబాబునాయుడు స్పీడు పెంచేస్తున్నారు. ఇంకోవైపు జనసేనతో పొత్తు ప్రచారం తమ్ముళ్ళల్లో అయోమయాన్ని పెంచేస్తోంది. వెరసి తాము యాక్టివ్‌గా ఉన్నామంటే కాదు తామే యాక్టివ్‌గా ఉన్నామని చూపించుకునేందుకు తమ్ముళ్ళు ఆరాటపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే వైరి వర్గాల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి.
వర్గాల మధ్య గొడవలు ఎంతదాకా వెళిపోయాయంటే ఒకరిపై మరొకరు దాడులు చేసుకుని కొట్టేసుకునేంతగా. తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెల శివరామ్, వైవీ ఆంజనేయుల వర్గాలు కుర్చీలతో కొట్టుకున్నాయి. పార్టీ కోసం కష్టపడుతున్నది తామంటే కాదు తామే అంటు అరుచుకుంటు తన్నేసుకున్నారు. మూడు రోజుల క్రితం అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గం సమావేశంలో కూడా ఇదే సీన్ జరిగింది. అక్కడ కూడా మాజీ ఎమ్మెల్యే ఉన్నవ హనుమంతరాయ చౌదరి వర్గం, ఉమామహేశ్వర నాయుడు వర్గాలు కుర్చీలతో కొట్టుకున్నాయి. ముందుముందు ఇంకా ఎన్ని నియోజకవర్గాల్లో తమ్ముళ్ళు కొట్టుకుంటారో చూడాలి.
ఈ రెండు ఘటనలను పక్కనపెట్టేస్తే ఆమధ్య పుంగనూరు పర్యటనలో చంద్రబాబు ముందే తమ్ముళ్ళు కొట్టుకున్నారు. అదే సమయంలో నెల్లూరులో కూడా తమ్ముళ్ళు ఒకరిపై మరొకరు దాడులు చేసుకుని కొట్టేసుకున్నారు. నిజానికి ఎంతమంది ప్రయత్నించినా టికెట్ దక్కేది ఒక్కళ్ళకే అని అందరికీ తెలుసు. మరింతోటిదానికి నేతలు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఎందుకంటే ఈ గొడవలకు చంద్రబాబే కారణమని చెప్పాలి.
ఎలాగంటే టికెట్ విషయంలో ఏకకాలంలో ఇద్దరు ముగ్గురు నేతలకు చంద్రబాబు ఆశలు కల్పిస్తున్నారు. ఎవరు వెళ్ళి మాట్లాడినా బాగా పనిచేసుకో టికెట్ నీకే అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారట. దాంతో ఎవరికి వాళ్ళు టికెట్ తమకే ఖాయమైందని చెప్పుకుని నియోజకవర్గాల్లో తిరిగేస్తున్నారు. ఇక్కడే నేతల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. టికెట్ ఆశిస్తున్న నేతలందరినీ కూర్చోబెట్టుకుని చెప్పేదేదో స్పష్టంగా చంద్రబాబు చెప్పటంలేదు. టికెట్ వస్తుందన్న ఆశతో పార్టీ కార్యక్రమాల కోసం లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకుంటున్నారు. ప్రత్యర్ధి వర్గం టికెట్ దక్కకుండా అడ్డుకుంటోందని అనుమానాలు మొదలవ్వటంతోనే నేతల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. దీనివల్లే నేతలు ఒకరిపై మరొకరు దాడులకు తెగబడుతున్నారు.