బాబు సింపతీ గేమ్.. ఓటర్లు వలలో పడతారా..?
అసెంబ్లీలో అవమానించారంటూ భోరున ఏడ్చినప్పుడే జనాల్లో స్పందన లేదు. అన్యాయంగా జైలులో పెట్టారని, ఆయనకు ప్రాణాపాయం ఉందని రచ్చ రచ్చ చేసినప్పుడు కూడా జనం స్పందించలేదు, ఇప్పుడీ కొత్త గేమ్ తో కూడా ఉపయోగం లేదు.
ఏపీలో వైసీపీ దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోందంటూ చంద్రబాబు ఇటీవల తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ ని కలసినప్పుడు కూడా ఆయన అదే ఫిర్యాదు చేశారు. పోనీ ఇప్పుడంటే టీడీపీ ప్రతిపక్షంలో ఉంది, అధికారుల అండదండలతో వైసీపీ మేనేజ్ చేస్తుందనుకోవచ్చు, కానీ టీడీపీ హయాంలో 2019 ఎన్నికలు జరిగినప్పుడు వైసీపీ ఏ దొంగఓట్లతో గెలిచింది. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ అప్పుడు లేనే లేదు. మరి ఆ విజయాన్ని ఏ ప్రలోభాలతో జగన్ సాధించినట్టు..? కానీ చంద్రబాబు మాత్రం తనదైన పద్ధతిలో అదే అబద్ధాన్ని పదే పదే చెబుతూ దాన్ని జనం నిజం అనుకునేలా భ్రమింపజేయాలనుకుంటున్నారు.
చంద్రగిరి టీడీపీ ఇన్ చార్జ్ పులివర్తి నానిని పరామర్శించిన చంద్రబాబు.. దొంగఓట్ల వ్యవహారంపై మరోసారి మండిపడ్డారు. చంద్రగిరిలో వేల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్చారని.. తిరుపతి, పీలేరు, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లోలోనూ ఇదే పరిస్థితి ఉందని, అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. అక్రమాలు చేసిన అధికారులను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. సచివాలయ సిబ్బంది సాయంతోనే దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారన్నారు. చివరకు బోగస్ గుర్తింపు కార్డులు కూడా ఇచ్చేస్తున్నారని, ఈ స్థాయిలో అక్రమాలు చేయడం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు చంద్రబాబు. దొంగఓట్ల సింపతీ గేమ్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అసెంబ్లీలో అవమానించారంటూ భోరున ఏడ్చినప్పుడే జనాల్లో స్పందన లేదు. అన్యాయంగా జైలులో పెట్టారని, ఆయనకు ప్రాణాపాయం ఉందని రచ్చ రచ్చ చేసినప్పుడు కూడా జనం స్పందించలేదు, ఇప్పుడు దొంగఓట్ల పేరు చెప్పి వైసీపీపై ఆరోపణలు చేస్తే జనం నమ్ముతారా..? నమ్మి చంద్రబాబుపై సింపతీ చూపిస్తూ టీడీపీ-జనసేన కూటమికి ఓట్లు వేస్తారా..? ప్రభుత్వ పథకాలను విమర్శించే అవకాశం లేక, చంద్రబాబు ఈ మార్గాన్ని ఎంచుకున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.