ఏపీ పోలీసులకు భారత రత్న ఇవ్వాలి.. చంద్రబాబు సెటైర్లు
28 సార్లు పోలవరం వెళ్లానని, 82 సార్లు సమీక్షలు చేపట్టానని, తన హయాంలో 72 శాతం ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయని, ఇదీ తన ట్రాక్ రికార్డ్ అంటూ చెప్పుకున్నారు చంద్రబాబు.
ఏపీ పోలీసుల వ్యవహార శైలిపై మరోసారి సెటైర్లు పేల్చారు చంద్రబాబు. రఘురామకృష్ణరాజు, అయ్యన పాత్రుడు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుకి వారికి భారత రత్న ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న బాబు, రాష్ట్రాన్ని కాపాడుకోడానికి టీడీపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. పదవులకోసం పాకులాడకూడదని హితవు పలికారు. కార్యకర్తలకు సొంత అజెండాలు వద్దని, ఐకమత్యంగా ముందుకు సాగాలన్నారు.
28సార్లు పోలవరం విజిట్, 82 సార్లు సమీక్షలు..
పోలవరం ప్రాజెక్ట్ తాను నాటిన మొక్క అని పోలవరం తన ప్రాణం అని అన్నారు చంద్రబాబు. 28 సార్లు పోలవరం వెళ్లానని, 82 సార్లు సమీక్షలు చేపట్టానని, తన హయాంలో 72 శాతం పనులు పూర్తయ్యాయని, ఇదీ తన ట్రాక్ రికార్డ్ అంటూ చెప్పుకున్నారు. తెలంగాణలో ఉన్న 7 ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లోకి తెచ్చిన ఘనత కూడా తనదేనన్నారు చంద్రబాబు. ముంపు మండలాలను ఏపీ కలపకపోతే సీఎం పదవి కూడా తనకు వద్దంటూ ఆనాడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆర్డినెన్స్ జారీ చేయించానని అన్నారు. అలాంటి తనను పోలవరం వెళ్లకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.
అప్పటి వరకు ఉంటా..
ఇదే తనకు చివరి ఎన్నిక అంటూ వైసీపీ పేలుస్తున్న సెటైర్లకు కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. సైకో పాలన భూస్థాపితం చేసేవరకు, రాష్ట్రాన్ని బాగు చేసేవరకు తాను ఉంటానని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీయేనని చెప్పారు. ఇప్పుడు జగన్ సంక్షేమ పథకాలంటూ గొప్పలు చెప్పుకుంటున్నా.. అన్న క్యాంటీన్లు మూసేశారని, టిడ్కో ఇళ్ళు సకాలంలో ఇవ్వలేకపోయారని దెప్పిపొడిచారు. ఇప్పటి నుంచి ప్రజలు అప్రమత్తంగా లేకపోతే పోలీసుల చేతుల్లో బలైపోతాం అని అన్నారు. వైసీపీ హయాంలో ఏపీకి పరిశ్రమలు రావడం లేదన్నారు. దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న నారాయణ విద్యా సంస్థల మీద కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు చంద్రబాబు.