నవరత్నాలు కాదు, అంతకు మించి ఇస్తా..
తాజాగా కుప్పంలో చంద్రబాబు చెప్పిన డైలాగులు. ఈ డైలాగులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చంద్రబాబుని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
"వైసీపీ నేతలు గడప గడపకు వెళ్లి నా గురించి తప్పుగా చెబుతున్నారు. నేను అధికారంలోకి వస్తే నవరత్నాలు ఆపేస్తానని అంటున్నారు. నవరత్నాలు కాదు, అంతకు రెట్టింపు స్థాయిలో నేనూ ఇస్తాను.." ఇవీ తాజాగా కుప్పంలో చంద్రబాబు చెప్పిన డైలాగులు. ఈ డైలాగులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చంద్రబాబుని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సహజంగా నేను సంక్షేమ పథకాలు అందిస్తా, ఆర్థిక సాయం చేస్తానని ఏ నాయకుడైనా చెబితే ప్రజలు ఆహ్వానిస్తారు, ఆదరిస్తారు. కానీ చంద్రబాబు మాటల్ని ఎవరూ నమ్మడం లేదు సరికదా ట్రోలింగ్ చేస్తున్నారు. కారణం.. గతంలో చంద్రబాబు చేసిన పనులు, ఆ మధ్య శ్రీలంకతో పోలుస్తూ పేల్చిన సెటైర్లు.
2014 ఎన్నికల్లో రైతు రుణ మాఫీ అనే ప్రధాన అస్త్రంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. తీరా అధికారం చేజిక్కిన తర్వాత పరిమితి విధించారు, కొర్రీలు పెట్టారు, చివరకు అన్నదాతలను మోసం చేశారు. ఆ కసి అంతా ఓటర్లు 2019లో తీర్చేసుకున్నారు. ఇంకోసారి చంద్రబాబుని ఎవరూ నమ్మరు. పోనీ నమ్ముతారనే అనుకుందాం. ఇప్పటి వరకూ నవరత్నాలను చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు కదా. వాటి వల్లే ఏపీ శ్రీలంకలా మారిపోతుందని, అప్పుల ఊబిలో కూరుకుపోతోందని సెటైర్లు వేశారు కదా. అమ్మఒడి, నాన్న బుడ్డితో జమ అయిపోతోందని వైసీపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు కదా. ఇప్పుడు అదే నోటితో నవరత్నాలకు మించి నేను మీకు ఇస్తాను అంటే జనం నమ్ముతారా..?
సోషల్ మీడియాలో ట్రోలింగ్..
నిన్న మొన్నటి వరకూ నవరత్నాలతో ఏపీ శ్రీలంకలా మారుతుందని చంద్రబాబు చెప్పిన మాటల్ని గుర్తు చేస్తూ నెటిజన్లు ఆటాడేసుకుంటున్నారు. ఇప్పుడు నవరత్నాలకు మించి ఇస్తానంటున్న చంద్రబాబు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు, ఆ అప్పుల్ని ఎలా తీరుస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారిపోతారంటూ కామెంట్లు చేస్తున్నారు. నవరత్నాలకు మించి ఇస్తానన్నా కూడా చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మరని అంటున్నారు.